Operation Sindoor: ఆ 9 లక్ష్యాలు ఇవే.. | Operation Sindoor: India carried out precision strikes on terror camps in Pakistan and PoK | Sakshi
Sakshi News home page

Operation Sindoor: ఆ 9 లక్ష్యాలు ఇవే..

May 8 2025 1:32 AM | Updated on May 8 2025 1:32 AM

Operation Sindoor: India carried out precision strikes on terror camps in Pakistan and PoK

పక్కాగా ఎంపిక

సవాలుగా మారిన వైనం

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ కోసం ఎంపిక చేసిన 9 లక్ష్యాలను పక్కాగా సేకరించిన నిఘా సమాచారం ఆధారంగా సైన్యం నిర్ణయించుకుంది. ఇవన్నీ ఆరోగ్య కేంద్రాలు తదితర ముసుగుల్లో నడుస్తున్నాయి. వీటిని కచ్చితంగా గుర్తించడం మన నిఘా వర్గాలకు సవాలుగా నిలిచింది. ఈ ఉగ్ర కేంద్రాలు, శిబిరాలను బయటి ప్రపంచం దృష్టి నుంచి దాచి ఉంచేందుకు పాక్‌ ప్రభుత్వం, సైన్యం అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటాయి. ఇందుకోసం ఎప్పటికప్పుడు వాటి గుర్తింపులు మార్చడం వంటి పనులు చేస్తుంటాయి. 

పాకిస్తాన్‌ భూభాగంలో ఉన్నవి (4) 
1: మర్కజ్‌ సుభాన్‌
జైషే మహ్మద్‌ ప్రధాన స్థావరం. అంతర్జాతీయ సరిహద్దులకు 100 కి.మీ. దూరంలో పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో బహావల్‌పూర్‌ సమీపంలో నరోవల్‌ జిల్లా తెహ్రా కలాన్‌ గ్రామంలో ఉంది. ఉగ్రవాదుల చేరిక, శిక్షణ వంటివి ఇక్కడ జరుగుతాయి. జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ ఇక్కడినుంచే కార్యకలాపాలు సాగిస్తుంటాడు. భద్రతా దళాలకు చిక్కిన అతన్ని 1999లో జైషే ఉగ్రవాదులు ప్రయాణికుల విమానాన్ని హైజాక్‌ చేసి విడిపించుకున్నారు. అజర్, అతని సోదరుడు అబ్దుల్‌ రవూఫ్‌ అస్గర్‌ తదితర అగ్ర నేతల నివాసాలు తదితరాలూ ఇక్కడే ఉన్నాయి. ప్రస్తుతం ఇది అస్గర్‌ కనుసన్నల్లో నడుస్తోంది. సరిహద్దుల గుండా ముష్కరులు చొరబడేందుకు అనువైన ప్రాంతాలను ఇక్కడినుంచే గుర్తించడం, అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సొరంగాలు తవ్వడం జేషేకు నిత్యకృత్యం. అంతేగాక డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలు, డ్రగ్స్‌ వంటివి పంపే లాంచ్‌ప్యాడ్‌ కూడా ఇదే. 2000లో జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీపై దాడి, 2001లో పార్లమెంటుపై దాడి మొదలుకుని 2019లో 40 మంది సీఆరీ్పఎఫ్‌ జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడుల దాకా ప్లానింగ్‌ జరిగిందిక్కడే. 

2: మర్కజ్‌ తొయిబా
‘టెర్రర్‌ ఫ్యాక్టరీ’గా పేరు పొందింది! నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో లాహర్‌ సమీపంలో మురిద్కేలో ఉంది. ఇది హఫీజ్‌ సయీద్‌ నేతత్వంలో పని చేసే లష్కరే తొయిబా ప్రధాన కేంద్రం. దానికి ఆయువుపట్టు కూడా. 1990లో ఉనికిలోకి వచ్చింది. నిత్యం కనీసం 1,000 మంది రిక్రూట్లకు ఇక్కడ 2 వారాల ప్రాథమిక కోర్సు నడుస్తుంటుంది. అందులో భాగంగా శారీరక, మతోన్మాద శిక్షణ ఇస్తారు. ముంబై ఉగ్ర దాడుల కుట్ర పురుడు పోసుకుంది ఇక్కడే. వాటికి పాల్పడ్డ కసబ్‌ బృందానికి దౌరా–ఎ–నిబ్బత్‌ (నిఘా) సంబంధిత శిక్షణ ఇక్కడే ఇచ్చారు. ముంబై దాడుల సూత్రధారులు డేవిడ్‌ హెడ్లీ, తహవ్వుర్‌ రాణా కూడా ఇక్కడ శిక్షణ పొందారు. ఇక్కడ ‘అతిథి గృహం’నిర్మాణానికి అప్పటి అల్‌కాయిదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ రూ.10 లక్షలిచ్చాడు. జమ్మూ కశ్మీర్‌తో పాటు హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల బాంబు పేలుళ్లు లష్కరే పనే. 

3: సర్జాల్‌ 
అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు 6 కి.మీ. దూరంలో సియాల్‌కోట్‌లో ఉంది. గత మార్చిలో నలుగురు జమ్మూ కశ్మీర్‌ పోలీసు సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు శిక్షణ పొందింది ఇక్కడే. 

4: మెహమూనా జోయా 
అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు 12 కి.మీ. దూరంలో సియాల్‌కోట్‌ సమీపంలో ఉంది. హిజ్బుల్‌కు కీలక శిక్షణ కేంద్రం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముసుగులో పని చేస్తోంది. జమ్మూలోని కథువా ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే కార్యకలాపాలకు ఇది కంట్రోల్‌ సెంటర్‌గా వ్యవహరిస్తోంది. పఠాన్‌కోట్‌ వైమానిక బేస్‌పై దాడుల వంటివాటికి ఇక్కడినుంచే వ్యూహరచన జరిగింది. జమ్మూ నగరంలో పలు ఉగ్ర దాడులకు కారకుడైన ఇర్ఫాన్‌ టండా ఈ కేంద్రానికి సారథి. 

పీఓకేలో ఉన్నవి (5) 
5: అహ్నే హదీత్‌ (బర్నాలా) క్యాంప్‌ 
నియంత్రణ రేఖకు 9 కి.మీ. దూరంలో భీంబర్‌ వద్ద ఉంది. ఆయుధాల వాడకంతో పాటు అత్యాధునిక పేలుడు పదార్థాల (ఐఈడీ) తయారీలో ఇక్కడ శిక్షణ ఇస్తారు. 150 మంది దాకా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వగలదు. 

6: మర్కజ్‌ తొయిబా
లష్కరే తొయిబా ముఖ్య కేంద్రాల్లో ఒకటి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో తాంగ్‌దార్‌ సెక్టర్లో ఉంది. కీలక ఉగ్ర శిక్షణకు ఇఎది కేంద్రం. ముంబైపై 26/11 దాడులకు తెగబడ్డ అజ్మల్‌ కసబ్‌ ఉగ్రవాద బృందం పూర్తిస్థాయి శిక్షణ పొందింది ఇక్కడే. ఇది 2000లో పుట్టుకొచ్చింది. పాక్‌ సైనిక, ఐఎస్‌ఐ అధికారులు ఇక్కడికి నిత్యం వస్తూ పోతూ ఉంటారు. ఏకకాలంలో 250 మందికి పైగా ఉగ్రవాదులు ఉండేందుకు ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయి. ఇక్కడినుంచి వారు ప్రధానంగా ఉత్తర కశ్మీర్‌లోకి చొరబడుతుంటారు. కొత్తగా చేర్చుకున్న వారికి మత, ఉగ్రవాద శిక్షణ కూడా ఇక్కడ అందుతుంది. పహల్గాంలో ఉగ్రవాదులపై దాడులకు తెగబడింది ఇక్కడినుంచి చొరబడ్డ ఉగ్రవాదులే! 2024లో కశ్మీర్‌లోని సోన్‌మార్గ్, గుల్‌మార్గ్‌లో భద్రతా బలగాలు, పౌరులపై దాడులు కూడా వారి పనే.  

7: గుల్పూర్‌ క్యాంప్‌
నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో కోట్లిలో ఉంది. రాజౌరీ, పూంచ్‌ జిల్లాల్లో ఆపరేట్‌ చేసే లష్కరే ఉగ్రవాదులకు బేస్‌. పూంచ్‌ 2023 దాడులు, 2024లో యాత్రికులపై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు. ముంబై దాడుల సూత్రధారి జకీవుర్‌ రెహ్మాన్‌ లఖ్వీ ఈ శిబిరానికి తరచూ వచ్చి రిక్రూటీలకు మతోన్మాద ప్రసంగాలిచ్చేవాడు. 

8: అబ్బాస్‌ క్యాంప్‌ 
నియంత్రణ రేఖకు 13 కి.మీ. దూరంలో కోట్లీలో ఉంది. లష్కరే ఆత్మాహుతి బాంబర్లకు ప్రధాన కేంద్రం. 150 మందికి పైగా ఉగ్రవాదులకు ఏకకాలంలో శిక్షణ ఇచ్చేందుకు వసతులున్నాయి. పూంచ్, రాజౌరీల్లో చొరబాట్లు, ఉగ్ర దాడులకు వ్యూహరచన మొత్తం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక్కడి వ్యవహారాలు చూసేది క్వారీ జరార్‌. జేషే చీఫ్‌ మసూద్‌ సోదరుడైన అస్గర్‌కు సన్నిహితుడు. పలు ఎన్‌ఐఏ కేసుల్లో జరార్‌ ప్రధాన నిందితుడు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ శిక్షణ కేంద్రం కూడా ఇక్కడే ఉంది. బోర్డర్‌ యాక్షన్‌ టీం (బీఏటీ)తో పాటు స్నైపర్‌ దాడులు తదితరాలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. 

9: సయీద్నా బిలాల్‌ క్యాంప్‌
జైషే ఉగ్ర శిబిరం. ముజఫరాబాద్‌లో ఉంది. తొలుత ఉగ్ర సామగ్రి నిల్వ కేంద్రం. తర్వాత ఆధునీకరించి ఉగ్రవాదులకు ఆయుధాలు, పేలుడు పదార్థాల వాడకం, అడవులు, ప్రతికూల పరిస్థితుల్లో సుదీర్ఘకాలం ఉండటం తదితరాల్లో శిక్షణ ఇచ్చే కేంద్రంగా మార్చారు. నిత్యం కనీసం 100 మందికి పైగా ఉగ్రవాదులు ఇక్కడ శిక్షణ పొందుతుంటారు. పాక్‌ సైన్యానికి చెందిన స్పెషల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ వీరికి నేరుగా శిక్షణ ఇస్తుంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement