వివరాలు ఏడుగురికే తెలుసు

Only seven people knew of the timing of air strike on Balakot - Sakshi

పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ జరిపిన మెరుపు దాడుల నిర్ణయం గురించి కేవలం ఏడుగురికే తెలుసని ఇంటెలిజెన్స్‌ అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, ప్రధాని జాతీయ భద్రత సలహాదారు అజిత్‌కుమార్‌ దోవల్, త్రివిధ దళాల అధిపతులు, పరిశోధన, విశ్లేషణ విభాగం (రా), ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధిపతులకు మాత్రమే వాయుసేన జరిపే దాడులకు సంబంధించిన సమాచారం ఉంది. పాక్‌పై మెరుపు దాడులకు లక్ష్యాలను గుర్తించాలని ఈ నెల 14న పుల్వామా ఉగ్రదాడి జరిగిన వెంటనే ‘రా’ను ప్రభుత్వం ఆదేశించింది. ‘రా’ ఆరు లక్ష్యాల జాబితా సమర్పించింది. బాలాకోట్‌లోని జైషే మహమ్మద్‌ శిక్షణ శిబిరం, జైషే స్థాపకుడు మసూద్‌ అజహర్‌ బావ యూసుఫ్‌ అజహర్‌ నడుపుతున్న ఉగ్ర శిబిరం ఈ జాబితాలో అగ్రభాగాన ఉన్నాయి.

భారత్‌ దాడి చేయడానికి అనుకూలమైనదిగా బాలాకోట్‌ ఉగ్ర స్థావరం కనిపించింది. దీనిపై మెరుపుదాడి చేస్తే జైషే మహమ్మద్‌ను సూటిగా హెచ్చరించినట్టవుతుందని, పుల్వామాలో భారత భద్రతా దళాలకు జరిగిన నష్టానికి సమానంగా బాలాకోట్‌లో జైషేకు నష్టం కలగజేయవచ్చని ప్రభుత్వం భావించిందని ఇంటెలిజెన్స్‌ అధికారులు తెలిపారు. అలాగే బాలాకోట్‌ శిబిరంపై దాడి వల్ల సాధారణ పౌరులెవరూ మరణించే అవకాశం లేకపోవడం వల్ల వెంటనే పాక్‌ ప్రతిదాడికి దిగే అవకాశంగానీ, ప్రపంచదేశాల నుంచి భారత్‌పై విమర్శలుగానీ ఉండవని నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో దాడులు చేసేందుకు ప్రధాని మోదీ ఈ నెల 18న తుది నిర్ణయం తీసుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top