ఈ నెల 26న అమిత్‌షా అధ్యక్షతన నార్కో–కోఆర్డినేషన్ సమావేశం
హాజరు కానున్న 44 మంత్రిత్వ శాఖలు, అన్ని రాష్ట్రాల అధికారులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంలో భాగంగా కేంద్ర ప్రభు త్వం మరిన్ని కఠిన చర్యలకు శ్రీకారం చుడుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈనెల 26న ఢిల్లీలో నార్కో–కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్‌సీఓఆర్‌డీ) 10వ అత్యున్నత స్థాయి సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 44 మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, మాదకద్రవ్య నియంత్రణ సంస్థలకు చెందిన 108 మంది ప్రతినిధులు ప్రత్యక్షంగా, వర్చువల్ విధానంలో పాల్గొంటారు.
విజన్ డాక్యుమెంట్ విడుదల
ఎన్‌సీఓఆర్‌డీ సమావేశ సందర్భంగా అమిత్ షా ‘నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ 2026–2029’ను విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, మాదకద్రవ్య నిరోధక సంస్థలు, ఇతర భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ పత్రాన్ని రూపొందించారు. మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు, సరఫరా నియంత్రణ, వ్యసన బాధితులకు పునరావాసం వంటి అంశాలకు సంబంధించిన సమగ్ర కార్యా చరణ ప్రణాళికను ఇందులో పొందుపరిచారు.
ముఖ్యంగా సింథటిక్ డ్రగ్స్, డార్క్‌నెట్ ద్వారా జరిగే అక్రమ రవాణా, యువతను మాదకద్ర వ్యాలకు దూరంగా ఉంచడం, చికిత్సా, పునరా వాస కేంద్రాల విస్తరణ వంటి అంశాలపై వచ్చే మూడు సంవత్సరాలకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. దేశవ్యాప్తంగా విధాన రూపకల్పన, అమలు, సంస్థాగత బలోపేతానికి ఈ విజన్ డాక్యుమెంట్ మార్గదర్శకంగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా అమిత్ షా ‘ఎన్‌సీబీ వార్షిక నివేదిక–2025’ను కూడా విడుదల చేయనున్నారు. అలాగే జమ్మూ, గౌహతిలో నూతనంగా నిర్మించిన ఎన్‌సీబీ జోనల్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు.
రూ.6 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం
దేశవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనకు చేపట్టిన ప్రత్యే క ‘ఆన్‌లైన్ డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్’ను కూడా కేంద్ర హోంమంత్రి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 2,09,500 కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేయనున్నాయి. వీటి అంచనా విలువ 6 వేల కోట్లు అని ప్రభుత్వం తెలిపింది. దేశంలో మాద కద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై ఎన్‌సీఓఆర్‌డీ సమావేశంలో సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు, డ్రగ్స్ నియంత్రణ అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, రాబోయే మూడు సంవత్సరాల కార్యాచరణపై చర్చ జరగనుంది.


