
శ్రీనగర్: పహల్గాం, బాల్తాల్ మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బుధవారం తెల్లవారుజామునుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసినట్లు జమ్మూ కశశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధూరి తెలిపారు. రెండు మార్గాల్లోనూ కురుస్తున్న భారీ వర్షాలు బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల రాకపోకలను ప్రభావితం చేశాయన్నారు.
పరిస్థితి మెరుగుపడేవరకు బాల్తాల్, నున్వాన్ బేస్ క్యాంపుల వైపు ఎలాంటి రాకపోకలను అనుమతించబోని తెలిపారు. ఈ విషయంలో యాత్రికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తామని అధికారులు వెల్లడించారు. పరిస్థితులు మెరుగుపడితే యాత్రను తిరిగి ప్రారంభించే విషయాలను కూడా యాత్రికులకు తెలియజేస్తామన్నారు. జూలై మూడో తేదీన ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీతో ముగియనుంది.
ఈ పవిత్ర వార్షిక యాత్ర కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తారు. యాత్రికులు రెండు మార్గాల్లో పుణ్య క్షేత్రానికి చేరుకుంటారు. ఒకటి 48 కిలోమీటర్ల పొడవైన పహల్గాం మార్గం కాగా, మరోటి నిటారుగా ఉన్న తక్కువ దూరమైన బాల్తాల్ మార్గం. ఈ ఏడాది ఇప్పటివరకు 3.93 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్‌ను దర్శించుకున్నారు.