
బాబా బర్ఫానీకి అందిన తొలి హారతి
పహల్గాం, బాల్టాల్ క్యాంప్‌ల నుంచి
బయలుదేరిన మొదటి బృందం
ఆగస్టు 9వ తేదీతో ముగియనున్న యాత్ర
భారీ బందోబస్తు చేపట్టిన యంత్రాంగం
సాక్షి, న్యూఢిల్లీ: హిమాలయాల్లోని పవిత్ర అమర్‌నాథ్ గుహలోని మంచు స్ఫటిక శివలింగ దర్శనానికి వేళయ్యింది. అత్యంత కఠినమైన, అననుకూల వాతావరణం మధ్య మొత్తం 38 రోజులపాటు సాగే అమర్‌నాథ్ యాత్ర గురువారం ప్రారంభమైంది. ఉదయం 3,880 మీటర్ల ఎత్తులోని అమర్‌నాథ్ గుహలో బాబా బర్ఫానీకి తొలి హారతి కార్యక్రమం నిర్వహించారు.
వందలు, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన భక్తుల్లో మొదటి యాత్రికుల బృందం పహల్గాం, బాల్టాల్ బేస్ క్యాంప్‌ల నుంచి ‘హర్ హర్ మహాదేవ్’, ‘బమ్ బమ్ భోలే’ నినాదాలతో గుహ దిశగా ప్రయాణం ప్రారంభించారు. బుధవారం జమ్మూలోని భగవతీ నగర్ క్యాంప్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపడంతో 168 వాహనాల్లో 5,892 మందితో కూడిన యాత్రికుల తొలి బృందం పయనమైంది.
ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీన రక్షాబంధన్ రోజున ముగుస్తుంది. ఇప్పటికే 3.5 లక్షలకుపైగా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జమ్మూలోని సరస్వతీ ధామ్, వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, మహాజన్ సభ వంటి కేంద్రాల్లో రోజూ సుమారు 2,000 మంది రిజిస్ట్రేషన్లను చేసుకుంటున్నారు. 2011లో అత్యధికంగా 6.34 లక్షల మంది భక్తులు అమర్‌నాథుని దర్శించుకున్నారు. ఈసారి ఇప్పటి వరకు యాత్రకు 3.5 లక్షల మంది ఆన్‌లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకున్నారు.
The first batch of Shri #AmarnathYatra2025 pilgrims was flagged off by Srinagar Police and the CRPF from the Pantha chowk base camp and directed to the Baltal base camp.#spiritualjourney #amarnathcave #yatra2023 #jammukashmir #DivineJourney #religioustourism #mountainpilgrimage pic.twitter.com/KHI1zN9Z4t
— crpf_fan (@CrprepostFan) July 2, 2025
ఘనమైన భద్రతా ఏర్పాట్లు
1990 నుంచి 2017 వరకు అమర్‌నాథ్ యాత్ర మార్గంలో 36 వరకు ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 53 మంది యాత్రికులు మరణించగా, మరో 167 మంది గాయపడ్డారు. 2000లో అమర్‌నాథ్ యాత్రపై మొదటి ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ఏడాది యాత్రను ప్రశాంతంగా పూర్తి చేయడానికి జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, ఆర్మీ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశాయి.
ప్రధానమైన పహల్గాం, బాల్టాల్ మార్గాల్లో కాంక్రీటు బంకర్లు, చెక్‌పోస్టులు, డ్రోన్ల ద్వారా నిత్యం నిఘా కొనసాగిస్తున్నారు. యాత్రికుల వాహనాలు పాస్‌ల ద్వారా మాత్రమే అనుమతులు పొందుతున్నాయి. పలు అంశల భద్రతా ఏర్పాట్లలో భాగంగా ప్రతి దశలో మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్లతో అణువణువూ తనిఖీలు చేస్తున్నారు.

రెండు రూట్ల ద్వారా యాత్ర
పహల్గాం రూట్: 48 కిలోమీటర్ల దూరం, సుమారు 5 రోజులు పడుతుంది. పహల్గాం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్వాడి వరకు యాత్ర తేలిక. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న పిస్సూ టాప్, ఆపై మరో 9 కిలోమీటర్లు నడవాలి. సాయంత్రానికి శేషనాగ చేరుకుంటారు. రెండో రోజు అక్కడ్నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచతరణి చేరుకుంటారు. ఆపైన చివరిగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్‌నాథ్ గుహకు పయనమవుతారు.
బాల్టాల్ మార్గం: యాత్ర సమయం తక్కువగా ఉన్న వారు ఈ మార్గంలో వెళ్లవచ్చు. సుమారు 16 కిలోమీటర్ల దూరముండే ఈ మార్గంలో సుమారు 2 రోజుల్లో పవిత్ర గుహకు చేరుకునే వీలుంది. అయితే ఇది కాస్త కఠినమైన పర్వతమయం, మలుపులతో కూడిన మార్గం. వృద్ధులకు అనువైంది కాదు.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇది కూడా చదవండి: ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం