
బలవన్మరణాల్లో దేశంలో 4వ స్థానంలో తెలంగాణ
2018–22 మధ్య ఏటా సగటున 8,746 ఆత్మహత్యలు
దేశంలో మొదటి స్థానంలో సిక్కిం.. తర్వాత ఛత్తీస్‌గఢ్, కేరళ
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాలు వెల్లడించిన కేంద్రం
దేశంలో ఏటా లక్షకు పైగానే మానసిక సమస్యల సంబంధిత ఆత్మహత్యలు
బలవన్మరణాల నివారణకు దేశవ్యాప్తంగా టెలి మానస్ హెల్ప్‌లైన్ సెంటర్లు
హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక వైద్య ఆసుపత్రిలో ‘టెలి మానస్’ సేవలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆందోళనకర స్థాయిలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. అత్యధికంగా ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం. దేశంలో 2018 నుంచి 2022 వరకు నమోదైన ఆత్మహత్యల వివరాలను నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో 2018లో 7,845 మంది ఆత్మహత్యలు చేసుకోగా, 2019లో 7,675, 2020లో 8,058, 2021లో ఏకంగా 10,171 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.
2022లో ఆ సంఖ్య 9,980గా నమోదైంది. ఐదేళ్లలో 43,729 మంది ఆత్మహత్యలు చేసుకోగా ఏటా సగటున 8,746 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. వీరిలో ఆర్థిక, కుటుంబ సమస్యలతో పాటు వివిధ కారణాలతో క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్న విద్యార్థులు, యువత, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఇటీవల రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానమిచ్చింది.
దక్షిణాది రాష్ట్రాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలోని తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు కూడా ఉండడం గమనార్హం. కాగా 2023 నుంచి 2025 వరకు జరిగిన ఆత్మహత్యల వివరాలను ఎన్‌సీఆర్‌బీ వెల్లడించలేదు.
దేశంలో ఐదేళ్లలో 7.62 లక్షల ఆత్మహత్యలు
ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం 2018లో దేశవ్యాప్తంగా 1,34,516 ఆత్మహత్యలు (రేటు 10.2) నమోదు కాగా, 2022లో ఆ సంఖ్య 1,70,924 (రేటు 12.4)గా నమోదైంది. ఆందోళనకర స్థాయిలో ఈ ఐదేళ్లలో మొత్తం 7,61,648 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే దేశంలో లక్ష జనాభాకు సగటున 11.26 రేటుతో ఆత్మహత్యలు నమోదయ్యాయన్న మాట.
లక్ష జనాభాను పరిగణనలోకి తీసుకొని లెక్కలేస్తే సిక్కిం రాష్ట్రంలో అత్యధికంగా ఐదేళ్లలో సగటున 37.5 రేటు నమోదైంది. 26.42 రేటుతో ఛత్తీస్‌గఢ్ తర్వాతి స్థానంలో ఉంది. మూడో స్థానంలో కేరళ (25.44)ఉండగా, నాలుగో స్థానంలో (23.3) తెలంగాణ, ఐదో స్థానంలో తమిళనాడు (21.8) ఉన్నాయి.
నిరుద్యోగం, కుటుంబ సమస్యలూ కారణం..
నిరుద్యోగం, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా గుర్తించగా.. పంటలు సరిగా పండక పోవడం వల్ల రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య కూడా దేశంలో ఏయేటికాయేడు పెరుగుతోంది.
దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మానసిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య 2018లో 10,134 మంది ఉంటే 2022లో ఆ సంఖ్య 14,600గా నమోదైంది. తెలంగాణలో ఐదేళ్లలో 2,590 మంది మానసిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. కాగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్‌లలో ఆత్మహత్యల రేటు అధికంగా ఉండగా, లక్షద్వీప్‌లో అతి తక్కువగా నమోదైంది.
ఆత్మహత్య ఆలోచనల నుంచి మళ్లిస్తున్న టెలి మానస్
చిన్న సమస్యను సైతం పెద్దగా ఆలోచించి ఆత్మహత్య వైపు అడుగువేసే ధోరణి పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను నివారించేందుకు వీలుగా 2022 అక్టోబర్‌లో ‘నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రాం (టెలి–మానస్)’ను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 53 టెలి మానస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి.
మొబైల్ యాప్, వీడియో కన్సల్టేషన్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలోని ఎర్రగడ్డ మానసిక వైద్య ఆసుపత్రిలో మానస్ కేంద్రం ఏర్పాటు చేయగా, ఈ కేంద్రానికి ఇప్పటివరకు 1,61,477 ఫోన్‌కాల్స్ వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఫోన్ రాగానే మానసిక నిపుణులు బాధితుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఆత్మహత్య ఆలోచనల నుంచి దూరం చేస్తున్నట్లు వివరించింది. దేశ వ్యాప్తంగా 53 టెలీ మానస్ కేంద్రాలకు ఇప్పటి వరకు 24.52 లక్షల కాల్స్‌ను వచ్చాయి.