Amarnath yatra:‘ఆపరేషన్‌ శివ’లో అద్భుత సాంకేతిక భద్రత ఇదే.. | Operation Shiva Amarnath Yatra High Tech Security | Sakshi
Sakshi News home page

Amarnath yatra:‘ఆపరేషన్‌ శివ’లో అద్భుత సాంకేతిక భద్రత ఇదే..

Jul 12 2025 12:07 PM | Updated on Jul 12 2025 12:34 PM

Operation Shiva Amarnath Yatra High Tech Security

శ్రీనగర్‌: జూలై 3న ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర.. భక్తుల ‘హర్‌హర్‌ మహాదేవ్‌’ నినాదాల మధ్య అంత్యంత వైభవంగా కొనసాగుతోంది. అమర్‌నాథ్ యాత్ర- 2025 కోసం ప్రభుత్వం 8,500 మంది సైనికులను, హైటెక్ భద్రతను ఏర్పాటు చేసింది. యాత్రలో అత్యవసర పరిస్థితులకు తక్షణం స్పందించేందుకు భారత ఆర్మీ హెలికాప్టర్లు నిరంతరం సిద్ధంగా ఉన్నాయి. యాత్రికుల ప్రయాణం సజావుగా సాగేందుకు క్విక్ రియాక్షన్ టీమ్స్ (క్యూఆర్‌టీ), టెంట్ వసతి, వాటర్ స్టేషన్లు, కమ్యూనికేషన్ యూనిట్లను అందుబాటులో ఉంచారు.

‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం..
అమర్‌నాథ్‌యాత్రకు ‘ఆపరేషన్‌ శివ’పేరుతో భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా అనంత్‌నాగ్‌లోని  48 కిలోమీటర్ల నున్వాన్-పహల్గామ్ మార్గం, గండర్‌బాల్‌లోని 14 కిలోమీటర్ల బాల్టాల్ మార్గాలు సైన్యం నిశిత నిఘాలో ఉన్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదుల నుంచి పెరిగిన బెదిరింపులకు ప్రతిస్పందనగా, సైన్యం బహుళ-స్థాయి ఉగ్రవాద నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేసింది.

ఆధునిక కెమెరాలతో..
డ్రోన్ హెచ్చరికలను తటస్థీకరించడానికి 50 కంటే ఎక్కువ సీ-యూఏఎస్‌,  ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలతో కూడిన కౌంటర్-మానవరహిత వైమానిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. డ్రోన్లు, అధిక రిజల్యూషన్ పీటీజెడ్‌ కెమెరాలను ఉపయోగించి యాత్రా మార్గాలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా ముప్పు ఏర్పడినప్పుడు వేగవంతమైన ప్రతిస్పందనకు  యాత్రా కాన్వాయ్‌ల నిజ-సమయ ట్రాకింగ్‌ను అందుబాటులో ఉంచారు.

100 పడకల ఆస్పత్రి
యాత్రికుల వైద్య మౌలిక సదుపాయాల కోసం 150 మందికి పైగా వైద్యులు, పారామెడిక్స్, రెండు అధునాతన డ్రెస్సింగ్ స్టేషన్లు, తొమ్మిది సహాయ పోస్టులు, 100 పడకల ఆస్పత్రి, రెండు లక్షల లీటర్ల ఆక్సిజన్‌తో కూడిన 26 ఆక్సిజన్ బూత్‌లను ఏర్పాటు చేశారు. అత్యవసర లాజిస్టిక్స్‌లో బాంబు నిర్వీర్య బృందాలు, అవాంతరాలు లేని కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సాంకేతిక సహాయ యూనిట్లు, 25,000 మందికి అత్యవసర రేషన్లు, బుల్డోజర్లు, ఎక్స్‌కవేటర్లు వంటి భారీ యంత్రాలను ఉంచారు.

గత రికార్డు అధిగమించేలా..
ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆర్మీ హెలికాప్టర్లు స్టాండ్‌బైలో ఉంటాయి. ఇప్పటికే 1.4 లక్షలకు పైగా భక్తులు శివుని మంచు లింగాన్ని దర్శించుకున్నారు. ఈ  ఏడాది యాత్ర కోసం నాలుగు లక్షలకు పైగా యాత్రికులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. 2024లో ఈ యాత్రలో 5.1 లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఈ సంఖ్యను అధిగమించనుంది. జూలై 3న ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర ఆగస్టు 9తో ముగియనున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement