
భువనేశ్వర్: లెక్చరర్ వేధింపుల కారణంగా ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఒడిశా రాష్ట్రం బాలాసోర్ విద్యార్థిని మృతి ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థిని వేధించిన ఇంటిగ్రేటెడ్ బీఈడీ విభాగ అధిపతి, లెక్చరర్ సమీర్ రంజన్ సాహూపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థిని ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్న ఫకీర్ మోహన్ కాలేజీ అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఐసీసీ) సభ్యులు లెక్చరర్ సమీర్ రంజన్ సాహూను విధుల నుంచి తొలగించాలని యాజమాన్యానికి సిఫార్స్ చేసింది. కాలేజీ విద్యార్థుల నుంచి లెక్చరర్ సాహుపై వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ సమన్వయ కర్త జయశ్రీ మిశ్రా వెల్లడించారు. అయినప్పటికీ, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్యానల్ సభ్యులు సైతం ఇప్పటికే విద్యార్థినుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, క్లాసులు చెప్పే విధానం మార్చుకోవాలని లెక్చరర్ సాహూకు సూచించింది.
ఈ సందర్భంగా విద్యార్థినుల పట్ల లెక్చరర్ సాహూ ఒడిగట్టిన ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఐసీసీ) సభ్యురాలు మినాటీ సేథీ లెక్చరర్‌పై ఆరోపణలు చేశారు. క్లాసు జరిగే సమయంలో విద్యార్థినులు ఏ చిన్న తప్పు చేసినా తరగతి గది బయట నిలబెట్టేవారు. అలా లైగింక వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థినిని కూడా అలాగే క్లాసు బయట నిలబెట్టారు.
ఇదే విషయంపై లెక్చరర్ తీరును ప్రశ్నిస్తూ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతో జూన్ 30న కాలేజీలో జరిగిన సెమిస్టర్ పరీక్షలను విద్యార్థినిని రాయనీవ్వలేదు. దీంతో ఆమె బాగా కృంగిపోయింది. ఎప్పుడైతే లెక్చరర్‌పై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిందో.. ఆ మరుసటి రోజు నుంచి విద్యార్థిని మానసికంగా, లైంగిక వేధింపులు గురైంది.
దుర్ఘటనకు ముందు లెక్చరర్ సాహూకు.. మృతి చెందిన విద్యార్థిని మధ్య సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో సాహూ తనకు ఫేవర్ చేయమని నన్ను అడిగారు. అందుకు నేను .. మీకు ఏ విధమైన ఫేవర్ కావాలని అడిగాను. అలా నేను అడిగినప్పుడు నాకు ఎలాంటి ఫేవర్ కావాలో అర్ధం చేసుకోలేనంత చిన్నపిల్లవి కావు నువ్వు’ అని నన్ను అన్నారంటూ ప్యానల్‌కు ఫిర్యాదు చేసింది’అని సేథి అన్నారు.
ఐసీసీ సభ్యులపై విద్యార్థిని తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. నా కుమార్తె మరణానికి ఐసీసీ సభ్యులే బాధ్యులు. నా కుమార్తె మరణంపై పక్షపాతంగా నివేదిక తయారు చేశారని అన్నారు.

జులై 12న ఒడిశాలోని బాలాసోర్ ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన 20 ఏళ్ల బీఈడీ విద్యార్థిని ఆత్మహత్య ఆ రాష్ట్రాన్ని కలచివేసింది. కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ విభాగ అధిపతి, లెక్చరర్ సమీర్ రంజన్ సాహూ తనని మానసికంగా,లైంగికంగా వేధిస్తున్నారంటూ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తనని తాను నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్యాయత్నంతో 95 శాతం కాలిన గాయాలైన విద్యార్థిని తోటి విద్యార్థులు ఎయిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ జూలై 14 రాత్రి మరణించారు. కాగా, విద్యార్థిని ఫిర్యాదు చేసిన సమీర్ కుమార్ సాహూపై కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) అతనికి క్లీన్ చిట్ ఇవ్వడంపై దుమారం చెలరేగింది.