
మోదీకి ఆ ధైర్యం ఉందా?
‘‘పహల్గాం దాడి తర్వాత ప్రధాని మోదీ సొంత ప్రతిష్టను కాపాడుకోవడానికి సైనిక దళాలను వాడుకుంటున్నారు. భారత్–పాక్‌ను బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టే ధైర్యం మోదీకి లేదు. ఇందిరా గాందీకి ఉన్న ధైర్యంలో మోదీకి కనీసం 50 శాతం ఉన్నా ట్రంప్ వ్యాఖ్యలు తప్పు అని పార్లమెంట్‌లో చెప్పాలి. చైనా, పాకిస్తాన్‌ల కుట్రల గురించి కొన్ని నెలల క్రితమే లోక్‌సభలో హెచ్చరించా. ప్రభుత్వం నా మాట విని ఉంటే ఐదు యుద్ధ విమానాలను కోల్పోయేవాళ్లం కాదు.
ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించగానే కొన్ని సున్నితమైన విషయాలను మన ప్రభుత్వం పాకిస్తాన్‌కు చేరవేసింది. సైనిక స్థావరాలపై దాడులు చేయడం లేదని, ఘర్షణ ఇష్టం లేదని చెప్పేసింది. అలా చేయడం లొంగిపోయినట్లు కాదా? కేవలం 30 నిమిషాల్లో మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌కు లొంగిపోయింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడులు చేయకుండా భారత వైమానిక దళం చేతులు కట్టేసింది ఎవరు? మోదీ ప్రతిష్టను కాపాడే ప్రయత్నం జరిగింది. పహల్గాం బాధితుల రక్తంతో మోదీ చేతులు తడిశాయి.
చైనా, పాకిస్తాన్ ఒక్కటి కాకుండా చూడాలని నాలుగు నెలల క్రితం నేను చెబితే చాలామంది ఎగతాళి చేశారు. మన విదేశాంగ విధాన వైఫల్యం వల్ల ఈ రెండు దేశాలు చేతులు కలిపాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌తోపాటు చైనాతోనూ యుద్ధం చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్‌కు చైనా అన్ని విధాలుగా సహకరించింది. యు ద్ధంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. పులిని వదిలిపెట్టాలి అనుకుంటే దానికి బంధనాలు విధించడం తగదు. శత్రువును ఓడించాలనుకుంటే పూర్తిగా ఓడించాలి. భారత్–పాక్ యుద్ధం తానే ఆపేశానని ట్రంప్ 29 సార్లు చెప్పారు.
‘మమ్మల్ని మీరు ఆపలేరు, కచి్చతంగా యుద్ధం కొనసాగిస్తాం’ అని ట్రంప్‌తో మన ప్రభుత్వ పెద్దలు ఎందుకు చెప్పలేకపోయారు. మనం ఇప్పుడు ప్రమాదకరమైన దశలో ఉన్నాం. చైనా–పాకిస్తాన్‌ల కూటమిని ఎదుర్కొంటున్నాం. సైనిక శక్తిని సక్రమంగా వాడుకోలేని ప్రధానమంత్రిని మనం ఇక భరించలేం. డొనాల్డ్ ట్రంప్ అబద్ధాలకోరు అని ధైర్యంగా చెప్పలేని ప్రధానిమంత్రిని భరించలేం. ఇందిరాగాంధీ చేసినట్లుగానే.. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, ‘పని పూర్తి చేసుకొని రండి’ అని చెప్పే ప్రధానమంత్రి ప్రస్తుతం మనకు కావాలి. పహల్గాం దాడికి సృష్టికర్త అయిన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ విందు ఇస్తే మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణం’’
– లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
అమిత్ షా రాజీనామా చేస్తారా?
‘‘నాయకత్వం అంటే ఏదైనా మంచి జరిగితే పేరు ప్రఖ్యాతలు కొట్టేయడం కాదు, తప్పు జరిగితే అందుకు బాధ్యత వహించాలి. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాం«దీలతోపాటు నా తల్లి సోనియా గాంధీ పెట్టుకున్న కన్నీళ్ల గురించి మాట్లాడుతున్న హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్‌పై యుద్ధం అర్ధాంతరంగా ఎందుకు ఆపారో మాత్రం చెప్పడం లేదు.
భద్రతాపరమైన లోపాలే పహల్గాంలో ఉగ్రవాద దాడికి కారణం. పాకిస్తాన్ దాడిలో మనం యుద్ధ విమానాలకు నష్టం జరగకపోతే ఆ విషయం పార్లమెంట్‌లో చెప్పడానికి ప్రభుత్వానికి భయం ఎందుకు? పహల్గాంలో నిఘా వైఫల్యానికి బాధ్యత ఎవరు తీసుకుంటారో చెప్పాలి. అమిత్ షా రాజీనామా చేస్తారా? లేక బాధ్యత వహిస్తారా? గతంలో జరిగిపోయిన విషయాలు పక్కనపెట్టి, ఇప్పుడు జరుగుతున్న దానిపై ప్రభుత్వం స్పందించాలి’’.
– కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా
ప్రభుత్వ వైఫల్యానికి గుర్తు
‘‘ఆపరేషన్ సిందూర్ మోదీ ప్రభుత్వ వైఫల్యానికి గుర్తు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సాకులు చెప్పి తప్పించుకోవద్దు. ఎవరి ఒత్తిడితో కాల్పుల విరమణ పాటించారో చెప్పాలి. భారత విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన దేశం ఒంటరిగా మిగిలిపోయింది, ఎవరూ మనకు మద్దతుగా రాలేదు. భారతదేశ దౌత్య విధానంలో ఇదొక చీకటి దశ. పుల్వామా, పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలి’’.
– సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్
ప్రజలను పరాజితులను చేశారు
‘‘విశ్వగురు(నరేంద్ర మోదీ) దేశ ప్రజలను పరాజితులను చేశారు. ఆపరేషన్ సిందూర్ ఘోరంగా విఫలమైంది. శత్రువులను పూర్తిగా ఒడించకుండానే యుద్ధం విరమించడం ఏమిటి? విశ్వగురు ప్రధానమంత్రిగా ఉన్న దేశంలో ఉగ్రవాద దాడులు తరచుగా ఎందుకు జరుగుతున్నాయి? ఈ దాడుల నుంచి ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోవడం లేదు’’.
–డీఎంకే ఎంపీ కనిమొళి
పాకిస్తాన్‌కు చేతకాకపోతే.. సాయం చేస్తాం
‘‘పాకిస్తాన్ సహా ప్రపంచమంతటా ఉగ్రవాదం అంతం కావాలని భారత్ కోరుకుంటోంది. పాక్ ఇకనైనా నిద్ర నుంచి మేల్కోవాలి. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలి. మీకు(పాక్) చేతకాకపోతే చెప్పండి మేము రంగంలోకి దిగుతాం. పాక్ ఆక్రమిత కాశీ్మర్(పీఓకే)ను ఎందుకు స్వాధీనం చేసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు స్వా«దీనం చేసుకోలేదో చెప్పాలి. పీఓకే ప్రజలు భారత పరిపాలనా వ్యవస్థలో భాగమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు’’.
– రాజ్యసభలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
సమగ్ర నివేదిక విడుదల చేయాలి
‘‘పహల్గాం ఉగ్రవాద దాడికి భద్రతాపరమైన లోపాలే కారణం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇందుకు బాధ్యత వహించాలి, పదవికి రాజీనామా చేయాలి. భారత్, పాక్ యుద్ధాన్ని ఆపేశానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా ప్రధాని మోదీ నోరుమెదపడం లేదు. మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని ప్రభుత్వం అంగీకరించిందా? హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి కా>ర్యక్రమాలతో మనకు ఒరిగిందేమీ లేదు. వాటితో మన వ్యూహాత్మక ప్రయోజనాలకు ఏమాత్రం లాభం లేదు.
ప్రపంచ నాయకులతో నరేంద్ర మోదీకి గొప్ప స్నేహ సంబంధాలున్నప్పటికీ పాక్‌తో యుద్ధం సమయంలో ఇండియాకు ఎవరూ మద్దతు ఇవ్వలేదు. పాక్ దురాగతాలను కనీసం అమెరికా కూడా బహిరంగంగా ఖండించలేదు. పాక్ ఓడిపోయే దశలో ఉన్నప్పుడు అనూహ్యంగా కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారు. అమెరికా జోక్యం నిజమేనా? దీనిపై ప్రభుత్వం కచి్చతంగా సమాధానం చెప్పాలి? కార్గిల్ యుద్ధంపై అప్పటి ప్రభుత్వం సమగ్ర నివేదిక విడుదల చేసింది. అదే తరహాలో పహల్గాం దాడిపై మోదీ సర్కార్ నివేదిక ఇవ్వాలి’’.
– రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే
మోదీ నరాల్లో రాజకీయాల ప్రవాహం
‘‘ప్రధాని నరేంద్ర మోదీ నరాల్లో సిందూరం ప్రవహించడం లేదు. కేవలం రాజకీయాలే ప్రవహిస్తున్నాయి. నిజంగా సిందూరమే ప్రవహిస్తే పహల్గాం ఉగ్రవాద దాడి జరిగేదే కాదు. మన ప్రజలను బలి తీసుకుంటున్న పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడం ఏమిటి? ఇదేనా మన విదేశాంగ విధానం?’’
– రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్