మట్టి నిండిన భోజనం!  | Aircraft crashes into medical hostel in Ahmedabad | Sakshi
Sakshi News home page

మట్టి నిండిన భోజనం! 

Jun 13 2025 5:58 AM | Updated on Jun 13 2025 1:01 PM

Aircraft crashes into medical hostel in Ahmedabad

బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ మెస్‌లో భయానక దృశ్యాలు 

విమాన ప్రమాదం ధాటికి కాలి బూడిదైన చెట్లు 

ప్రమాద తీవ్రతకు నుజ్జునుజ్జయిన భవనం పిల్లర్లు

అహ్మదాబాద్‌: సరిగ్గా మధ్యాహ్న భోజన సమయం కావటంతో బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ క్యాంటీన్‌లో హడావిడి మొదలైంది. ఆకలిమీద ఉన్న రెసిడెంట్‌ వైద్యులు నచ్చిన ఆహారం వడ్డించుకొని డైనింగ్‌ టేబుల్స్‌పై కూర్చొని ముచ్చట్లు చెప్పుకొంటూ.. ఇష్టంగా తింటున్నారు. అంతలోనే ఒక్కసారిగా భారీ శబ్దం.. బీటలువారి కూలిపోతున్న భవనం గోడలు.. ఆ వెంటనే దూసుకొచ్చిన రాకాసి అగ్నికీలలు.. కన్నుమూసి తెరిచేంతలో అంతా బూడిదమయం.

అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం కూలిన ప్రదేశంలో దృశ్యాలు ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో చెప్పకనే చెప్పాయి. దుమ్ముతో నిండిపోయిన డైనింగ్‌ టేబుల్స్‌.. వాటిపై నిండుగా భోజనంతో పొందికగా ఉన్న ఆహారం పేట్లు.. పక్కనే మంచినీటి గ్లాసులు.. మసిబారిపోయిన క్యాంటీన్‌.. కొన్నిచోట్ల చిందరవందరగా పడిపోయిన సామగ్రి ఆ ఘోర ప్రమాదానికి సాక్ష్యంగా నిలిచాయి. ఆ హాస్టల్‌ భవనంలో రెసిడెంట్‌ వైద్యులు నివాసం ఉంటారు.  

నేరుగా భవనంపైనే కూలిన విమానం.. 
సాంకేతిక లోపంతో విమానం కిందికి దూసుకొచ్చి నేరుగా హాస్టల్‌ భవనంలోని నాలుగో అంతస్తులోకి దూసుకెళ్లింది. దీంతో భవనం ఒకవైపు పూర్తిగా ధ్వంసమైంది. భవనానికి భారీ రంధ్రం ఏర్పడింది. భారీగా మంటలు చెలరేగటంతో భవనం గోడలు మొత్తం నల్లగా మారిపోయాయి. ఆ భవనం చుట్టూ ఉన్న చెట్లు నిలువునా కాలిపోయిన నల్లని మొద్దులు మాత్రమే మిగిలాయి. 

విమాన ఫ్యూజ్‌లేజ్‌లు (ప్రధాన బాడీలోని కొన్ని భాగాలు) భవనం గోడల్లోనే ఇరుక్కుపోయాయి. విమానం టైర్లు తల్లకిందులై భవనంలో వేలాడుతూ కనిపించాయి. విమానం తాకిన వేగానికి ఎంతో బలమైన భవనం పిల్లర్లు కూడా నుజ్జునుజ్జు అయ్యాయి. ఆరంతస్తుల భవనం బయటి గోడలు మొత్తం ధ్వంసమైపోయి బిల్డింగ్‌ ఎందుకూ పనికిరాకుండా పోయింది.   

Advertisement
 
Advertisement
Advertisement