న్యూఢిల్లీ: జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ (విమానం నం. AI 2030)కు బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని వెంటనే రాజస్థాన్లోని జైపూర్ విమానాశ్రయానికి మళ్లించారు. బుధవారం ఉదయం 9:45 గంటల సమయంలో ఈ విమానం జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా, సురక్షితంగా ల్యాండ్ అయింది.
హైజాక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో అనుసరించే అత్యున్నత స్థాయి భద్రతా నిబంధనలను అధికారులు వెంటనే అమలు చేశారు. విమానం నేలపైకి చేరిన తర్వాత భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, నిచ్చెనలు ఏర్పాటు చేసి ప్రయాణికులను కిందకు దించారు. అనంతరం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, వచ్చిన బాంబు బెదిరింపు కేవలం నకిలీదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. తనిఖీలు పూర్తయ్యాక ప్రయాణికులు, సిబ్బందికి తదుపరి అనుమతులు ఇచ్చారు. ఈ అసౌకర్యానికి గాను ప్రయాణికులకు ఉచితంగా ఇతర ప్రయాణ ఏర్పాట్లు చేసుకునేందుకు (రీషెడ్యూలింగ్) అవకాశం కల్పించడంతో పాటు, ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకునే వారికి పూర్తి రుసుమును రీఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది.


