‘చిట్టీ’కి పాఠాలతో పాకెట్‌మనీ! | AI companies offering part-time jobs such as robot trainer and AI data actor | Sakshi
Sakshi News home page

‘చిట్టీ’కి పాఠాలతో పాకెట్‌మనీ!

Jun 13 2026 4:53 AM | Updated on Jun 13 2026 4:53 AM

AI companies offering part-time jobs such as robot trainer and AI data actor

రోబో ట్రైనర్, ఏఐ డేటా యాక్టర్‌ వంటి పార్ట్‌టైం కొలువులు అందిస్తున్న ఏఐ కంపెనీలు

ఇంటి పనులు చక్కబెట్టే ఏఐ రోబోల కోసం హ్యూమన్‌ యాక్షన్‌ డేటా సేకరణ

సాక్షి, హైదరాబాద్‌: కృత్రిమ మేధ (ఏఐ), రొబోటిక్స్‌ రంగాల్లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి కొత్త తరహా ఉద్యోగాలకు మార్గం సుగమం చేస్తోంది. రోజువారీ ఇంటి పనులనే వీడియో తీసి రోబోలకు అర్థమయ్యేలా వివరించే ‘రోబో ట్రైనర్‌’, ‘ఏఐ డేటా యాక్టర్‌’ పేరుతో నగరంలో కొత్త ట్రెండ్‌ ఊపందుకుంది.  

ఇంటి పనులన్నీ చకచకా
రోబోలు, హ్యూమనాయిడ్‌ యంత్రాలు మనుషుల పనితీరును నేర్చుకోవడానికి ప్రత్యేక వీడియో డేటా అవసరం. ఇందుకోసం టెక్‌ కంపెనీలు సాధారణ వ్యక్తులతో వివిధ పనులను వీడియోల రూపంలో చిత్రీకరిస్తున్నాయి. ఏఐ రోబోలకు ఇంటి పనులు నేర్పేందుకు టెక్‌ కంపెనీలు ‘హ్యూమన్‌ యాక్షన్‌ డేటా’ సేకరిస్తున్నాయి. బట్టలు ఉతకడం మొదలు డోర్‌ తెరవడం, కాఫీ కలపడం, వంటావార్పు వరకు ఈ రోబోలు ఇట్టే చక్కబెడుతున్నాయి.

ఈ పనులన్నింటినీ వాటి ఒంటబట్టించేందుకు ఏఐ సాంకేతికతకు పదునుపెడుతున్నారు. ఇంట్లో చేసే పనులను ఫోన్‌  కెమెరాలతో షూట్‌ చేసి ఆ వీడియోలను ఏఐ మోడల్స్‌కు ఫీడ్‌ చేస్తారు. ఇలా పనులను ఏఐ మోడ్‌లో షూట్‌ చేసే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలకు భారీగా డిమాండ్‌ పెరిగింది. ఇలా షూట్‌ చేస్తే గంటకు రూ. 250 వరకు చెల్లిస్తున్నారు. రోజుకు 4 గంటలు పనిచేస్తే నెలకు రూ. 25 వేల వరకు ఆదాయం వస్తోంది.

భవిష్యత్తులో ఇంటి పనులు, పరిశ్రమల కార్యకలాపాలు, సేవారంగంలో రోబోలు మరింత సమర్థంగా పనిచేయడానికి ఈ డేటా ఉపయోగపడనుంది. ఇందుకోసం టెస్లా ఆప్టిమస్, ఫిగర్‌ ఏఐ, గూగుల్‌ డీప్‌మైండ్‌ రోబో ప్రాజెక్టుల కోసం హైదరాబాద్‌కు చెందిన డేటామోర్ఫ్, ఇన్‌స్ట్రక్ట్‌ ల్యాబ్, రోబో–ఎక్స్‌ఏఐ వంటి డేటా సంస్థలు నియామకాలు చేపడుతున్నాయి. మాదాపూర్, హైటెక్‌ సిటీలో ఆయా సంస్థలకు ప్రత్యేక స్టూడియోలు ఉన్నాయి. ఇంటర్‌ పాసైన వారికి సైతం అవకాశం కల్పిస్తున్నాయి.

ఎక్కువ శ్రమ లేదు  
డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నా. కాలేజీ అయ్యాక స్టూడియోకి వెళ్తా. నిన్న అన్నం వార్చడం, ఈ రోజు బెడ్‌షీట్‌ మార్చడం షూట్‌ చేశారు. గంటకు
రూ. 230 ఇచ్చారు. ఈ పార్ట్‌టైం జాబ్‌తో నెలవారీ పాకెట్‌ మనీ సంపాదించుకుంటున్నా.  – శ్రావణి, కూకట్‌పల్లి   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement