మేమొస్తే ‘అగ్నిపథ్‌’ రద్దు: ఖర్గే | Sakshi
Sakshi News home page

మేమొస్తే ‘అగ్నిపథ్‌’ రద్దు: ఖర్గే

Published Tue, Feb 27 2024 6:19 AM

Agnipath scheme gross injustice to country youth - Sakshi

న్యూఢిల్లీ: తాత్కాలిక ప్రాతిపాదికన యువతను సైన్యంలో చేర్చుకునే ‘అగ్నిపథ్‌’ పథకాన్ని తాము అధికారంలోకి వస్తే రద్దుచేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రకటించేనాటికే భర్తీ ప్రక్రియలో ఉత్తీర్ణులై నియామక పత్రాల కోసం ఎదురుచూసిన రెండు లక్షల మందికి తక్షణం ఉద్యోగాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన లేఖ రాశారు.

‘సాయుధదళాల్లోకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు ఆగిపోవడంతో లక్షలాది మంది యువత భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. అగ్నివీర్‌లు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాలు కోల్పోయి నడి రోడ్డుపై నిల్చుంటారు. సామాజికంగానూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు’’ పేర్కొన్నారు. సైనిక అభ్యర్థుల పోరాటానికి మద్దతుగా ఉంటామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాం«దీ అన్నారు.

సైన్యంలో చేరేందుకు యువత కన్న కలలను అగ్నివీర్‌ పథకంతో బీజేపీ చిదిమేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ‘‘కేంద్రానికి కొంత జీతభత్యాల చెల్లింపులు ఆదా అవుతాయి తప్పితే ఈ పథకంతో ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు’’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సచిన్‌ పైలెట్‌ అభిప్రాయపడ్డారు. అగ్నివీర్‌ కింద సైన్యంలోకి తీసుకునే యువతలో నాలుగేళ్ల తర్వాత అత్యంత ప్రతిభ కనబరిచిన 25 శాతం మందినే 15 ఏళ్ల శాశ్వత కమిషన్‌లోకి తీసుకుంటామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే.

Advertisement
 
Advertisement