
మేఘాలయలో అదృశ్యమై యూపీలో ప్రత్యక్షమైన హతుడి భార్య
ప్రియుడితో కలిసి భర్తను చంపిన సోనమ్
ఆమె, ప్రియుడు సహా ఐదుగురి అరెస్ట్
రాజా రఘువంశీ హత్యకేసులో విడిపోతున్న చిక్కుముడులు
షిల్లాంగ్/లక్నో/ఘాజీపూర్/ఇండోర్: పెళ్లయిన తొమ్మిది రోజులకు హనీమూన్‌కు వెళ్లి మేఘాలయలో శవమై తేలిన నవవరుడు రాజా రఘువంశీ హత్య కేసులో ఎట్టకేలకు భార్య సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పోలీసులకు లొంగిపోయింది. ప్రియుడి ప్లాన్ ప్రకారం కొందరికి సుపారీ ఇచ్చి భర్తను ఆమెనే హత్య చేయించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం అర్థరాత్రిదాటాక ఈ కేసులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వివరాలను మేఘా లయ మహిళా డీజీపీ ఇదాషీషా నోంగ్‌రాంగ్ సోమవారం పత్రికా సమావేశంలో చెప్పారు.
ప్రియుడు కుష్వాహాతో కలిసి కుట్ర!
సోనమ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో 19 ఏళ్ల ఆకాశ్ రాజ్‌పుత్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 22 ఏళ్ల విశాల్ సింగ్ చౌహాన్, 21 ఏళ్ల రాజ్‌సింగ్ కుష్వాహా, బినా పట్టణంలో 23 ఏళ్ల ఆనంద్ కురీ్మలను పోలీసులు అరెస్ట్‌చేశారు. అయితే మీడియా కథనాల ప్రకారం మేఘాలయలో అదృశ్యమైన సోనమ్ ఆదివారం అర్థరాత్రి దాటాక ఉత్తరప్రదేశ్‌లోని వారాణాసి–ఘాజీపూర్ రహదారి పక్కన కాశీ ధాబా వద్దకు ఒంటరిగా వచ్చి తన సోదరుడు, తన భర్త సోదరునికి ఫోన్ చేసింది. వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు.
ఆమె చాలా నీరసంగా కనిపించడంతో తొలుత సదర్ ఆస్పత్రికి తర్వాత ‘వన్ స్టాప్ సెంటర్’కు తరలించి చివరకు అరెస్ట్‌చేశారు. అయితే తాను నిర్దోషినని, ఎవరో తనను కిడ్నాప్‌చేశారని సోనమ్ చెప్పింది. అయితే పోలీసులు మాత్రం భర్త హత్యోదంతంలో సోనమ్‌ది కీలకపాత్ర పని చెబుతున్నారు. సోనమ్ సోదరుడు నిర్వహించే ఒక కంపెనీలో పనిచేసే రాజ్‌సింగ్ కుష్వాహాకు ఆమెతో సన్నిహిత సంబంధం ఉందని, రాజ్‌సింగ్ ప్లాన్ ప్రకారమే మరికొందరికి సుపారీ ఇచ్చి సోనమే భర్తను చంపేయించిందని పోలీసులు చెప్పారు.
కుష్వాహాతో సోనమ్ తరచూ మాట్లాడేదని రాజా రఘువంశీ సోదరుడు సైతం ఆరోపించారు. అరెస్టయిన వారిలో ఇద్దరు కుష్వాహాకు స్నేహితుల ని తేలింది. ఇండోర్‌లో ట్రాన్స్‌పోర్ట్ వ్యాపా రం చేసే రాజారఘువంశీకి సోనమ్‌తో మే11 వ తేదీన వివాహమైంది. ఇద్దరు మే 20వ తేదీన మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. 22న మావ్‌లఖియాత్ గ్రామంలో ఒక స్కూటర్‌ను అద్దెకు తీసుకుని సజీవ చెట్ల వంతెనను చూసేందుకు వెళ్లి 23వ తేదీన అదృశ్యమయ్యారు.
10 రోజుల తర్వాత జూన్ రెండున భర్త మృతదేహాన్ని ఈస్ట్‌ఖాసీ హిల్స్ జిల్లాలో ని వేసాడాంగ్ జలపాతం సమీప లోయలో పోలీసులు కుళ్లిన స్థితిలో కనుగొన్నారు. అప్ప టి నుంచి సోనమ్ ఆచూకీ కోసం మేఘాల య సిట్ పోలీసులు, రాష్ట్ర ఎన్‌డీఆర్‌ఎఫ్, స్థా నిక నిఘా బృందాలు, స్థానిక యంత్రాంగం విస్తృతస్థాయిలో గాలిస్తుండటం తెల్సిందే. రాజ్ కుష్వాహా, విశాల్ చౌహాన్, ఆకాశ్ రాజ్ పుత్‌లను ఇండోర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీళ్లను ఏడు రోజులపాటు మేఘాలయ పోలీసు కస్టడీకి అప్పగిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులిచ్చారు.
రిటర్న్ టికెట్లు బుక్‌చేయలేదు
కోడలు అరెస్ట్ వార్త తెలిసి రాజా తల్లి ఉమా రఘువంశీ మీడియాతో మాట్లాడారు. ‘‘పెళ్లయ్యాక హనీమూన్‌కు వెళ్లే ఉద్దేశ్యం మా అబ్బాయికి లేదు. కానీ భార్య ప్రోద్భలంతోనే అతను ట్రిప్‌కు వెళ్లాడు. ట్రిప్‌కు వెళ్లబోతున్న విషయం కోడలు మాలో ఒక్కరికి కూడా చెప్పలేదు. మేఘాలయకు వెళ్లాలనే ప్లాన్ సోనమ్‌దేనని మా అబ్బాయి చిట్టచివర్లో చెప్పాడు. ట్రిప్ టికెట్లు ఆమెనే బుక్‌చేసింది. కానీ రిటర్న్ టికెట్లు బుక్‌చేయలేదు. నా కుమారుడు గాయాలపాలై చనిపోతే ఈమె కు ఒక్క గాయం కాకపోవడం అనుమా నంగా ఉంది. నా కొడుకును ఆమెనే చంపి ఉంటే సోనమ్‌ను ఖచి్చతంగా ఉరితీయాల్సిందే’’అని ఉమ డిమాండ్ చేశారు.
రాజా శరీరంపై లోతైన గాయాలు
రాజా మృతదేహానికి చేపట్టిన పోస్ట్‌మార్టమ్ నివేదిక తాజాగా బహిర్గతమైంది. తలపై రెండు లోతైన గాయాలున్నాయి. ఒకటి ముందువైపు, మరోటి వెనుకవైపు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. శరీరంపైనా కత్తి గాయాలున్నాయి. మధ్యప్రదేశ్‌లో పథకరచన చేసి, మేఘాలయలో అమలుచేసి, చివరకు ఉత్తరప్రదేశ్‌లో నిందితులు దొరికిపోయారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తమ రాష్ట్రంలో హత్య జరగడంతో స్థానికులే ఈ హత్యచేశారని పుకార్లు రావడంతో మేఘాలయ పర్యాటకంపై ప్రభావం పడిందని, ఇప్పుడు అంతా స్పష్టతరావడంతో మా రాష్ట్రంపై పడిన మచ్చ తొలగిపోయిందని రాష్ట్ర మంత్రి అలెగ్జాండర్ ఆనందం వ్యక్తంచేశారు.
ఇది కూడా చదవండి: గ్రెటా థన్‌బర్గ్‌కు ఘోర అవమానం.. గాజా దారిలో ఇజ్రాయెల్ అడ్డగింత