అగ్రహీరో బ్యానర్‌లో ద్రౌపది ముర్ము బయోపిక్ | Aamir Khan To Produce Mega Documentary On President Droupadi Murmu's Inspiring Journey, Check Out Interesting Details Inside | Sakshi
Sakshi News home page

అగ్రహీరో బ్యానర్‌లో ద్రౌపది ముర్ము బయోపిక్

Jun 20 2026 11:23 AM | Updated on Jun 20 2026 11:48 AM

Aamir Khan to Produce Mega Documentary on President Droupadi Murmu

ముంబై: సినీ రంగంలో మిస్టర్ పర్ఫెక్ట్ ఖాన్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మరో స్ఫూర్తిదాయక కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  జీవిత ప్రయాణాన్ని ఒక డాక్యుమెంటరీ రూపంలో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ రూపొందిస్తోంది. డాక్యుమెంటరీలు తీయడంలో పేరుగాంచిన దర్శకురాలు స్వాతి చక్రవర్తి భత్కల్ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.

ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సరికొత్త సంచలనం
దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిష్టించిన తొలి గిరిజన మహిళగా, దేశానికి రెండవ మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ఆమె వ్యక్తిగత, ప్రజా జీవితంలోని అద్భుత విజయాలను ఈ డాక్యుమెంటరీ ద్వారా ఆమిర్ ఖాన్ ప్రపంచానికి చూపించబోతున్నారు. గతంలో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వచ్చిన ‘రుబారు రోష్ని’ (2019) అనే అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన స్వాతి చక్రవర్తి భత్కల్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తుండటం విశేషం.

రాజకీయాలకు అతీతంగా.. 
ఈ డాక్యుమెంటరీ కేవలం ద్రౌపది ముర్ము రాజకీయ విజయాల చుట్టూనే తిరగదు. ఒడిశాలోని ఒక చిన్న గిరిజన గ్రామంలో ప్రారంభమైన ఆమె బాల్యం, ప్రజాసేవలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, వాటన్నింటినీ తట్టుకుని నిలబడిన ఆమె పోరాట పటిమను ఈ చిత్రంలో చూపించనున్నారు.

సొంత ఊరిలో షూటింగ్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాల్యానికి సంబంధించిన కీలక సన్నివేశాలను మరింత సహజంగా పునర్నిర్మించడం కోసం, చిత్ర బృందం ఒడిశాలోని ఆమె సొంత గ్రామంలో ఇప్పటికే కొన్ని భాగాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ కథను అత్యంత సహజంగా తెరకెక్కించేందుకు అక్కడి  ప్రజలను, నటీనటులను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం చేశారు. గత ఏడాది (2025) ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శనను రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు నడిచినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement