సాక్షి, చెన్నై: పోలీసుల విచారణలో మరణించిన ఆకాష్ అనే యువకుడి మతదేహానికి 100 రోజుల తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో అంత్యక్రియలు బుధవారం జరిగాయి. మదురై ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ నుండి ఆకాష్ మతదేహాన్ని స్మశాన వాటికకు తరలిస్తున్న సమయంలో పోలీసులకు, అతడి బంధువులకు మధ్య తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో ఘర్షణకు దిగిన బంధువులు 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
మార్చురీకే పరిమితం
శివగంగై జిల్లా మానామదురైకి చెందిన ఆకాష్ డెలిసన్ (24) అనే యువకుడిని, స్థానికంగా ఇద్దరిపై దాడి చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసుల కొట్టడం వల్లే ఆకాష్ కాలు ఎముక విరిగిందని పేర్కొంటూ అతడిని మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అయితే, చికిత్స పొందుతూ మార్చి 8వ తేదీన ఆకాష్ ప్రాణాలు కోల్పోయాడు. హైకోర్టు ఆదేశాల మేరకు అప్పట్లోనే అతడి మతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కొట్టి చంపేశారంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో మత దేహం మార్చురీకి పరిమితమైంద.
100 రోజులుగా నిరసన
ఈ ఘటనపై హత్య కేసు నమోదైనప్పటికీ, బాధ్యులైన పోలీసులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఆకాష్ బంధువులు పలు విడతలుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ వచ్చారు.అప్పటి వరకు మత దేహాన్ని తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు.
కోర్టు ఆదేశంతో రంగంలోకి ప్రభుత్వం
వంద రోజులకు పైగా మార్చురికి పరిమితమైన ఆకాష్ మతదేహానికి ప్రభుత్వమే అంత్యక్రియలు లేదా దహన సంస్కారాలు నిర్వహించాలని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ తమిళనాడు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.దీంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం, జిల్లా రెవెన్యూ అధికారి అన్బళగన్ నేతత్వంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆకాష్ మతదేహాన్ని అంత్యక్రియల కోసం ఆసుపత్రి వెలుపలికి తీసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న ఆకాష్ బంధువులు మతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు.
ఉద్రిక్తతల నడుమ అంత్యక్రియలు
పరస్పరం వాగ్వాదం, తీవ్ర తోపులాట నడుమ ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అతడి బంధువులు 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆకాష్ కుటుంబీకుల సమక్షంలోనే మదురైలోని తత్తనేరి విద్యుత్ శ్మశానవాటికలో మతదేహానికి దహన సంస్కారాలు పూర్తి చేశారు.


