ఫారం–6 వివాదంపై ఎన్నికల కమిషన్
ఒకరికి ఒకే ఓటు.. చట్ట సవరణ ఉద్దేశమిదే
సుప్రీంకోర్టుకు తెలిపిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఓటరు జాబితాలో పేరు నమోదు ప్రక్రియలో ఆధార్ వినియోగంపై తలెత్తిన సందిగ్ధానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తెరదించింది. ఆధార్‌ను పౌరసత్వా నికి రుజువుగా ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణించడం లేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ఆధార్ చట్టం, కోర్టు తీర్పుల మేరకే నడుచుకుంటున్నామని, అది కేవలం గుర్తింపు ధ్రువీకరణ పత్రం మాత్రమేనని పేర్కొంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫారం–6లో పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డును ఉపయోగించడాన్ని నిరోధించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌కు ఈసీ ఈ మేరకు తన స్పందనను తెలిపింది.
ఈసీ అఫిడవిట్‌లో ముఖ్యాంశాలు
కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దూబే దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌లో పలు కీలక చట్టపరమైన అంశాలున్నాయి. ఎన్నికల (సవరణ) చట్టం– 2021 ద్వారా ప్రజా ప్రాతినిధ్య చట్టం– 1950లోని సెక్షన్ 23కు సవరణలు చేశామని ఈసీ గుర్తు చేసింది. ఈ సవరణ ముఖ్య ఉద్దేశం ఒకే వ్యక్తి వేర్వేరు ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకోవడాన్ని అరికట్టడమేనని స్పష్టం చేసింది. ఈ సవరణ ఆధారంగానే 2022 జూన్ 17 నుంచి ఫారం–6లో మార్పు లు చేసినట్లు తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23(4) ప్రకారం, ఆధార్‌ను కేవలం గుర్తింపు రుజువుగా మాత్రమే పరిగణిస్తున్నామంది.
యూఐడీఏఐ స్పష్టత
ఆధార్ అనేది పౌరసత్వం, నివాసం లేదా పుట్టిన తేదీకి రుజువు కాదని యూఐడీఏఐ స్వయంగా 2023 ఆగస్టు 22న జారీ చేసిన కార్యాలయ మెమోరాండంలో స్పష్టం చేసిందని ఈసీ కోర్టు దృష్టికి తెచ్చింది. 2016 నాటి ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 కూడా ఆధార్ నంబర్‌ను పౌరసత్వానికి లేదా నివాసానికి రుజువుగా భావించరాదని స్పష్టంగా చెబుతోందని వివరించింది.
కోర్టు తీర్పుల ప్రస్తావన
ఆధార్‌ను పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించలేమని చెబుతూ ఈసీ పలు న్యాయస్థానాల తీర్పులను కూడా ప్రస్తావించింది. అందులో 2022 బాంబే హైకోర్టు, 2024, 2025లో సుప్రీంకోర్టులో జరిగిన వేరువేరు విచారణలు ఉన్నాయి. ముఖ్యంగా సుప్రీం ఆదేశాల మేరకు, 2025 సెప్టెంబర్ 9నే అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఈసీ తెలిపింది. ‘బిహార్ రాష్ట్ర సవరించిన ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపుల కోసం ఆధార్ చట్టం–2016లోని సెక్షన్ 9, ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 23(4) ప్రకారం ఆధార్ కార్డును కేవలం గుర్తింపు రుజువుగా మాత్రమే వాడాలి, పౌరసత్వ రుజువుగా పరిగణించరాదు’అని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసినట్లు పేర్కొంది.
ఫారం–6లో ఆధార్ వినియోగాన్ని పుట్టిన తేదీ రుజువుగా నిరోధించాలన్న పిటిషనర్ అభ్యర్థనపై ఈసీ స్పందిస్తూ... ప్రస్తుతం ఉన్న చట్టపరమైన నిబంధనలు ఆధార్ వినియోగాన్ని కేవలం గుర్తింపు ప్రయోజనాలకే పరిమితం చేశాయని, తమ సూచనలు కూడా ఈ చట్టాలకు పూర్తిగా అనుగుణంగానే ఉన్నాయని తేల్చి చెప్పింది. కాగా, గత వారం ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెల్సింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23(4) ఆధార్‌ను గుర్తింపు రుజువుగా అనుమతించినంత కాలం, ఫారం–6లో దాని వినియోగాన్ని పూర్తిగా నిరోధించలేమని, యూఐడీఏఐ జారీ చేసిన నోటిఫికేషన్ చట్టబద్ధమైన నిబంధనను అధిగమించలేదని కోర్టు అభిప్రాయపడినట్లు సమాచారం.


