breaking news
citizenship revoked
-
ఆధార్ పౌరసత్వ రుజువు కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: ఓటరు జాబితాలో పేరు నమోదు ప్రక్రియలో ఆధార్ వినియోగంపై తలెత్తిన సందిగ్ధానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తెరదించింది. ఆధార్‌ను పౌరసత్వా నికి రుజువుగా ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణించడం లేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఆధార్ చట్టం, కోర్టు తీర్పుల మేరకే నడుచుకుంటున్నామని, అది కేవలం గుర్తింపు ధ్రువీకరణ పత్రం మాత్రమేనని పేర్కొంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫారం–6లో పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డును ఉపయోగించడాన్ని నిరోధించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌కు ఈసీ ఈ మేరకు తన స్పందనను తెలిపింది.ఈసీ అఫిడవిట్లో ముఖ్యాంశాలుకేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దూబే దాఖలు చేసిన ఈ అఫిడవిట్లో పలు కీలక చట్టపరమైన అంశాలున్నాయి. ఎన్నికల (సవరణ) చట్టం– 2021 ద్వారా ప్రజా ప్రాతినిధ్య చట్టం– 1950లోని సెక్షన్ 23కు సవరణలు చేశామని ఈసీ గుర్తు చేసింది. ఈ సవరణ ముఖ్య ఉద్దేశం ఒకే వ్యక్తి వేర్వేరు ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకోవడాన్ని అరికట్టడమేనని స్పష్టం చేసింది. ఈ సవరణ ఆధారంగానే 2022 జూన్ 17 నుంచి ఫారం–6లో మార్పు లు చేసినట్లు తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23(4) ప్రకారం, ఆధార్‌ను కేవలం గుర్తింపు రుజువుగా మాత్రమే పరిగణిస్తున్నామంది.యూఐడీఏఐ స్పష్టతఆధార్ అనేది పౌరసత్వం, నివాసం లేదా పుట్టిన తేదీకి రుజువు కాదని యూఐడీఏఐ స్వయంగా 2023 ఆగస్టు 22న జారీ చేసిన కార్యాలయ మెమోరాండంలో స్పష్టం చేసిందని ఈసీ కోర్టు దృష్టికి తెచ్చింది. 2016 నాటి ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 కూడా ఆధార్ నంబర్‌ను పౌరసత్వానికి లేదా నివాసానికి రుజువుగా భావించరాదని స్పష్టంగా చెబుతోందని వివరించింది.కోర్టు తీర్పుల ప్రస్తావనఆధార్ను పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించలేమని చెబుతూ ఈసీ పలు న్యాయస్థానాల తీర్పులను కూడా ప్రస్తావించింది. అందులో 2022 బాంబే హైకోర్టు, 2024, 2025లో సుప్రీంకోర్టులో జరిగిన వేరువేరు విచారణలు ఉన్నాయి. ముఖ్యంగా సుప్రీం ఆదేశాల మేరకు, 2025 సెప్టెంబర్ 9నే అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఈసీ తెలిపింది. ‘బిహార్ రాష్ట్ర సవరించిన ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపుల కోసం ఆధార్ చట్టం–2016లోని సెక్షన్ 9, ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 23(4) ప్రకారం ఆధార్ కార్డును కేవలం గుర్తింపు రుజువుగా మాత్రమే వాడాలి, పౌరసత్వ రుజువుగా పరిగణించరాదు’అని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసినట్లు పేర్కొంది. ఫారం–6లో ఆధార్ వినియోగాన్ని పుట్టిన తేదీ రుజువుగా నిరోధించాలన్న పిటిషనర్ అభ్యర్థనపై ఈసీ స్పందిస్తూ... ప్రస్తుతం ఉన్న చట్టపరమైన నిబంధనలు ఆధార్ వినియోగాన్ని కేవలం గుర్తింపు ప్రయోజనాలకే పరిమితం చేశాయని, తమ సూచనలు కూడా ఈ చట్టాలకు పూర్తిగా అనుగుణంగానే ఉన్నాయని తేల్చి చెప్పింది. కాగా, గత వారం ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెల్సింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23(4) ఆధార్‌ను గుర్తింపు రుజువుగా అనుమతించినంత కాలం, ఫారం–6లో దాని వినియోగాన్ని పూర్తిగా నిరోధించలేమని, యూఐడీఏఐ జారీ చేసిన నోటిఫికేషన్ చట్టబద్ధమైన నిబంధనను అధిగమించలేదని కోర్టు అభిప్రాయపడినట్లు సమాచారం. -
పీఎన్బీ స్కాం: చోక్సీకి భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్నేషనల్ బ్యాంకు కుంభకోణం (పీఎన్బీ స్కాం)లో మరో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు, నీరవ్‌మోదీ మేనమామ, డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి భారీ షాక్ తగిలింది. వేలకోట్ల రూపాయల మేర పీఎన్బీ బ్యాంకునకు కుచ్చుటోపీ పెట్టి, ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ పౌరసత్వాన్ని ఆంటిగ్వా అండ్ బార్బుడా రద్దు చేసింది. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించినట్టు సమాచారం. గత సంవత్సరమే తన పౌరసత్వాన్ని ఆంటిగ్వా రద్దు చేయడంతో, సెయింట్ జాన్‌లోని సివిల్ కోర్టును ఆశ్రయించాడు. చోక్సీ. అయితే భారత బ్యాంకులను మోసం చేసి, తమ దేశంలో స్థిర పెట్టుబడుల పేరుతో తమ దేశంలో ఆశ్రయం పొందటానికి వీల్లేదన్న అక్కడి ప్రభుత్వ నిర్ణయంతో, చోక్సీ పిటిషన్‌ను కొట్టివేసి అవకాశం ఉందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఆంటిగ్వా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ గతంలో హామీ ఇచ్చినట్టుగా చోక్సీని భారత్‌కు అప్పగించే చర్యలు త్వరితగతిన ప్రారంభమవు తాయని వారు తెలిపారు. కాగా దౌత్యపరమైన ఒత్తిడి తరువాత మెహుల్ చోక్సీ పౌరసత్వ ఉపసంహరణకు ఆంటిగ్వా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ గతంలోనేఅంగీకరించారు. నేరస్థులకు, ఆర్థిక నేరాలకు పాల్పడినవారికి తమ దేశంలో చోటు లేదని 2019 జూన్‌లో స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే పీఎన్బీ స్కాంకు సంబంధించి లండన్ కోర్టు తీర్పు అనంతరం, ఈ కేసులోప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని దేశానికి తిరిగి రప్పించేందుకు రంగం సిద్ధ మవుతున్న సంగతి తెలిసిందే. -
మెహుల్ చోక్సీకి ఎదురు దెబ్బ
ఆంటిగ్వా/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రూ.14వేలకోట్లు కుచ్చుటోపి పెట్టిన కేసులో పరారీలో ఉన్న నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆంటిగ్వా ప్రభుత్వం అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తామని, న్యాయపరమైన ప్రక్రియ ముగిశాక భారత్‌కు అప్పగిస్తామని ప్రకటించింది. న్యాయపరంగా అన్ని దారులు మూసుకుపోతే భారత్‌కు పంపిస్తామని ఆంటిగ్వా ప్రధాని గ్యాస్టన్ బ్రౌనే చెప్పారు. చోక్సీ బ్యాంకుకి డబ్బులు ఎగ్గొట్టాక కరేబియన్ దీవులకు పరారై ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. పీఎన్బీలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చాక చోక్సీ గత ఏడాది జనవరిలో పరారయ్యాడు. అంతకు ముందే 2017 నవంబర్‌లో సిటిజెన్షిప్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ (సీఐపీ) కింద ఆంటిగ్వా, బార్బడా జంట దీవుల పౌరసత్వాన్ని తీసుకున్నాడు. కాగా, లక్ష అమెరికా డాలర్లను ఇన్వెస్ట్ చేసి ఆంటిగ్వా, బార్బడా పౌరసత్వాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. మరోవైపు చోక్సీ తానేమీ పారిపోలేదని, వైద్య చికిత్స కోసం ఆంటిగ్వాకు వచ్చానని ట్రీట్మెంట్ అయిపోగానే భారత్‌కు వస్తానని అతని కేసు విచారిస్తున్న బాంబే హైకోర్టుకు వెల్లడించాడు. గీతాంజలి జెమ్స్ కంపెనీకి చెందిన వజ్రాల వ్యాపారులైన చోక్సీ, నీరవ్ మోదీలు పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం నీరవ్ లండన్ జైల్లో ఉన్నాడు. వారిద్దరినీ తిరిగి భారత్‌కు తీసుకురావడానికి ఈడీ, సీబీఐ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. -
జెండాను దగ్ధం చేస్తే పౌరసత్వం రద్దా?
న్యూయార్క్: అమెరికాలో ఎవరైనా జాతీయ జెండాను తగలబెడితే వారి పౌరసత్వం రద్దవుతుందని లేదా ఏడాది జైలు శిక్ష పడుతుందని దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ట్విట్టర్లో పౌరులను హెచ్చరించారు. అమెరికా రాజ్యాంగం గురించి సరైన అవగాహన లేకుండా, జాతీయ జెండా తగలబెట్టే విషయమై 1989లో అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గురించి తెలియక ట్రంప్ ఈ హెచ్చరిక చేశారా? తెలిసి కూడా తన ఉద్దేశాన్ని వెల్లడించేందుకు ఈ హెచ్చరిక చేశారా? అన్నది స్పష్టం కావడం లేదు. అమెరికాలో ఎవరైనా నిరసన వ్యక్తం చేయడం కోసం జాతీయ జెండాను తగలబెట్టడం రాజ్యాంగబద్ధమే. దానికి ఎలాంటి శిక్షలు లేవు. జాతీయ జెండాను దగ్ధం చేయడమనేది ప్రభత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడంతో సమానమని, అది దేశ రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కని 1989లో అమెరికా సుప్రీం కోర్టు బెంచీ 5-4 మెజారిటీతో తీర్పును ఇచ్చింది. 1984లో డల్లాస్‌లో జరిగిన రిపబ్లికన్ జాతీయ సదస్సు వేదిక వెలుపల అప్పటి దేశాధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ విధానాలను వ్యతిరేకిస్తూ గ్రెగరీ జాయ్ జాన్సన్ అనే వ్యక్తి అమెరికా జాతీయ జెండాను దగ్ధం చేశారు. ఈ కేసులోనే సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించింది. అప్పటి నుంచి జాతీయ జెండాను దగ్ధం చేయడాన్ని నేరంగా పరిగణించేందుకు పలు ప్రయత్నాలు జరిగినా అవి ఫలించలేదు. జాతీయ జెండా పరిరక్షణా చట్టానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ఓ సభ్యుడు 2005లో ప్రతిపాదించగా అప్పుడు న్యూయార్క్ సెనేటర్‌గా ఉన్న హిల్లరీ క్లింటన్ కూడా మద్దతు పలికారు. ఎవరైనా జాతీయ జెండాను దగ్ధం చేసినా, అవమానించినా లక్ష డాలర్ల జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష విధించాలని ఆ బిల్లులో ప్రతిపాదించారు. అయితే ఆ బిల్లు ఇప్పటికీ కూడా సెనేట్‌లో చర్చకు రాలేదు. అదే సమయంలో అలాంటి శిక్షను దేశ రాజ్యాంగంలోనే పొందుపర్చాలంటూ అప్పటి ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్‌లో ఓ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దాన్ని ప్రజా ప్రతినిధుల సభ 286-130 ఓట్లతో ఆమోదించింది. ఆ తర్వాత సెనేట్‌లో ఆ బిల్లు 66-34 ఓట్ల తేడాతో వీగిపోయింది. సెనేట్‌లో బిల్లు ఆమోదానికి మూడింట రెండు వంతల మెజారిటీ అవసరం కాగా, ఒక్క ఓటు తగ్గింది. ఒకవేళ ఆ రోజున సెనేట్ ఆ బిల్లును ఆమోదించి ఉన్నట్లయితే దేశంలోని 50 రాష్ట్రాలకుగాను 38 రాష్ట్రాలు ఆ బిల్లును ఆమోదించినట్లయితేనే రాజ్యాంగ సవరణ సాధ్యమయ్యేది. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ మసాచుసెట్స్‌లోని హాంప్‌షైర్ కాలేజీలో కొందర విద్యార్థులు అమెరికా జాతీయ జెండాను తగలబెట్టిన నేపథ్యంలో ట్రంప్ ఈ హెచ్చరికను జారీ చేసినట్లు అర్థం అవుతోంది. జెండాను ఎవరు దగ్ధం చేసినా దాన్ని నేరంగానే పరిగణించాలని ట్రంప్ అధికార యంత్రాంగంలోని అధికారి జాసన్ మిల్లర్ వ్యాఖ్యానించారు.


