
డెహ్రాడూన్: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నకిలీ బాబాల మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ, ఈ నకిలీ బాబాలు తమ ఇష్టానుసారం చెలరేగిపోతున్నారు. అయితే ఇటువంటి వారి ఆటకట్టించేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నిర్వహించిన ‘ఆపరేషన్ కాలానేమి’లో మొత్తం 82 మంది నకిలీ బాబాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తరాదిలో చార్ ధామ్ యాత్ర, కన్వర్ యాత్ర కొనసాగుతున్న దృష్ట్యా నకిలీ బాబాలు పుట్టుకువస్తున్నారు. దీనిని గుర్తించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘ఆపరేషన్ కాలానేమి’ని చేపట్టి, దొంగబాబాల ఆగడాలను కట్టడి చేస్తోంది. ప్రజలను మోసం చేసేందుకు సాధువులు, స్వామీజీల వేషం ధరించినవారిని గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. డెహ్రాడూన్‌లో జరిగిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 82 మంది నకిలీ బాబాలను అరెస్టు చేసినట్లు వివరించారు.
మతం ముసుగులో ప్రజలను దోపిడీ చేసేందుకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సూచనల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించినట్లు డెహ్రాడూన్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పీ) అజయ్ సింగ్ తెలిపారు. అరెస్టు చేసిన దొంగ బాబాలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని పలు విభాగాల కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అజయ్ సింగ్ పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో బంగ్లాదేశ్ జాతీయుడు షా ఆలం అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతన్ని డెహ్రాడూన్ జిల్లాలోని సహస్పూర్‌లో అరెస్టు చేశారు.