డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినాటి నుంచి అక్రమ వలసదారులపై కఠినవైఖరి అవలంభించారు. వారు దేశంలోకి రాకుండా కఠిన ఆంక్షలు విధించారు. అయినప్పటికీ అమెరికాలోకి అక్రమ వలసలు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా ఆ దేశం విడుదల చేసిన సర్వేలో కనీసం 20 నిమిషాలకు ఒక భారతీయుడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే యత్నం చేస్తున్నట్లు తేలింది. ఈ నివేదిక భారత్‌లో కొంత ఆందోళన కలిగిస్తుంది.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టగానే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై రెచ్చిపోయారు. ఎట్టిపరిస్థితుల్లో వారు దేశంలో ఉండేది లేదంటూ హుకుం జారీ చేశారు. తమకు తాము స్వచ్ఛందంగా దేశాన్ని వదిలితే ప్రోత్సహాకాలు అందిస్తామని ప్రకటించారు. అయితే ట్రంప్ ఇంతగా కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆదేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారి సంఖ్య ఇప్పటికీ లక్షల్లోనే ఉంది. 2025లో USAలోకి అక్రమంగా ప్రవేశించిన వారి సంఖ్య 3లక్షల 90వేలుగా ఉన్నట్లు యుఎస్ కస్టమ్స్.. బోర్డర్ ప్రోటెక్షన్ విడుదల చేసిన సర్వే తెలిపింది.
అయితే వీరిలో భారతీయులు ఉండడం ఆందోళన కలిగిస్తుంది. బోర్డర్ ప్రొటెక్షన్ నివేదిక ప్రకారం... 2025లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ 23,830 భారతీయులు అరెస్టయ్యారు. అదే 2024 అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ అరెస్టైన వారి సంఖ్య 85,119గా ఉంది. మెుత్తంగా 2025లో USAలోకి అక్రమంగా ప్రవేశించిన వారి సంఖ్య 3లక్షల 90వేలుగా ఉంది. అయితే బాధాకర విషయం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు ఒంటరిగా సరిహద్దు దాటుతున్నారు. వారి వెంట ఎవరూ లేకుండా పోలీసులకు పట్టుబడుతున్నారు.
భారతీయులు అధికంగా కెనడా సరిహాద్దునుండే అమెరికాలోకి ప్రవేశిస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. 6,968 మంది కెనడా, యుఎస్ బోర్డర్ గుండా ప్రవేశిస్తూ అరెస్టైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. 2022లో ఇటువంటి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ ఓ భారతీయ కుటుంబం మృతిచెందిన ఘటన ఒకటి జరిగింది.గుజరాత్ గాంధీనగర్‌కు చెందిన ఓ కుటుంబం కెనడా సరిహద్దు గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిద్దామని ప్రయత్నించారు. కానీ ఆ తీవ్రమైన చలిగాలులకు తట్టుకోలేక మార్గమధ్యలోనే నలుగురు మరణించారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.


