కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలో ఘటన
యశవంతపుర: తల్లిదండ్రుల కళ్లెదుటే ఐదేళ్ల చిన్నారిని చిరుత ఎత్తుకెళ్లి చంపిన హృదయవిదారక ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా నవిలెకల్‌గుడ్డలో శుక్రవారం జరిగింది. సాన్వి (5) అనే చిన్నారి ఉదయం తన ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా చిరుత దాడిచేసి లాక్కొని పారిపోయింది. చిన్నారి అరుపులు విని తల్లిదండ్రులు పరుగు పరుగున బయటకొచ్చారు.
అప్పటికే చిరుత ఆ చిన్నారిని తన నోటికి కరుచుకుని అడవిలోకి వెళ్లడాన్ని చూసి వారు తల్లడిల్లిపోయారు. అనంతరం గ్రామస్తులు వెతకగా సమీపంలోని పొదల్లో చిన్నారి మృతదేహం కనిపించింది. బీరూరు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేశారు. చిరుత దాడితో గ్రామస్తులు పొలాల్లో పనులకు వెళ్లడానికి భయపడుతున్నారు.


