breaking news
Leopard Tamil Nadu
-
చిన్నారిని చంపేసిన చిరుత
యశవంతపుర: తల్లిదండ్రుల కళ్లెదుటే ఐదేళ్ల చిన్నారిని చిరుత ఎత్తుకెళ్లి చంపిన హృదయవిదారక ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా నవిలెకల్గుడ్డలో శుక్రవారం జరిగింది. సాన్వి (5) అనే చిన్నారి ఉదయం తన ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా చిరుత దాడిచేసి లాక్కొని పారిపోయింది. చిన్నారి అరుపులు విని తల్లిదండ్రులు పరుగు పరుగున బయటకొచ్చారు.అప్పటికే చిరుత ఆ చిన్నారిని తన నోటికి కరుచుకుని అడవిలోకి వెళ్లడాన్ని చూసి వారు తల్లడిల్లిపోయారు. అనంతరం గ్రామస్తులు వెతకగా సమీపంలోని పొదల్లో చిన్నారి మృతదేహం కనిపించింది. బీరూరు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేశారు. చిరుత దాడితో గ్రామస్తులు పొలాల్లో పనులకు వెళ్లడానికి భయపడుతున్నారు. -
చాకచక్యంగా చిరుతను బంధించిన మహిళ
చెన్నై: గొర్రెల కొట్టంలోకి చొరబడిన చిరుతపులిని ఓ మహిళ చాకచక్యంగా బంధించిన సంఘటన తమిళనాడులోని నీలగిరి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. ముదుమలై పంచాయతీ నందిగుండు ప్రాంతంలో శశిధరన్కు చెందిన గొర్రెల కొట్టంలోకి ఒక చిరుత చొరబడి ంది. ఒక గొర్రెను చంపి అక్కడే తింటూ కూర్చుంది. కొట్టం నుంచి వస్తున్న శబ్దానికి తెల్లవారుజాము 4 గంటల సమయంలో మేలుకున్న శశిధరన్ భార్య యమున పులిని గుర్తించింది. దానిని ఎలాగైనా బంధించాలని నిశ్చయించుకున్న ఆమె.. మెల్లగా వెళ్లి కొట్టం ద్వారానికి తాళంవేసింది. తరువాత భార్యాభర్తలు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మత్తు ఇంజక్షను ఇచ్చి పులిని తీసుకెళ్లారు. తమ కొట్టంలోకి ప్రవేశించిన పులిని చూడగానే భయంతో కేకలు వేయకుండా ఒంటరిగా వెళ్లి దాని గేటుకు తాళం వేసిన యమున ధైర్య సాహసాలను స్థానికులు కొనియాడారు.


