
గోండా: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సరయూ నది కాలువలో కారు పడిపోవడంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సహా 11 మంది మృత్యువాతపడ్డారు. నలుగురు గాయాలపాలయ్యారు. వీరంతా ఖర్గుపూర్‌లోని పృథ్వీనాథ్ ఆలయానికి వెళ్తుండగా బెల్వా బహుతా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితులంతా గోండా జిల్లా సిహాగావ్ గ్రామానికి చెందిన వారని ఇటియాథోక్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో కృష్ణ గోపాల్ రాయ్ చెప్పారు. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్ సహా 15 మంది ఉన్నారన్నారు.
గ్రామస్తులు, సహాయక బృందాల సాయంతో కాలువలో మునిగిన వాహనం నుంచి 11 మృతదేహాలను వెలికి తీసినట్లు ఆయన వివరించారు. వర్షం కురుస్తుండటంతో రోడ్డంతా జారుడుగా మారిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి కాలువలో పడిపోయిందని తెలిపారు. వెంటనే పోలీసులకు తెలిపామన్నారు. తాడు సాయంతో వాహనాన్ని బయటకు లాగామన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సిహాగావ్‌లో మేవాలాల్ మాధ్యమిక పాఠశాల మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రహ్లాద్ కుటుంబంలోని 9 మంది ఉన్నట్లు చెప్పారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఆలయానికి వెళ్తున్న వారు ప్రమాదానికి గురి కావడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులు రూ.50 వేల చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందజేస్తామని ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాగా, మృతుల్లో ప్రహ్లాద్ భార్య బీనా, ఇద్దరు కుమార్తెలు కాజల్, రింకీ, ప్రహ్లాద్ సోదరుడు రాంకరణ్, ఆయన భార్య అనుసూయ, వీరి కుమార్తె సౌమ్య, కుమారుడు శుభ్, ప్రహ్లాద్ మరో సోదరుడు రాంరూప్, ఆయన భార్య నందిని, కుమారుడు అమిత్ ఉన్నారు. ప్రహ్లాద్ పొరుగింట్లో ఉండే రామలలన్ వర్మ భార్య సంజు, అతడి సోదరి అంజు కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. ప్రహ్లాద్ కుమారుడు సత్యం, రామ్ లలన్ వర్మ, వాహనం డ్రైవర్ సీతారామన్ గాయపడ్డారు. వీరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదం తెలిసిన సిహాగావ్ గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.