
భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన 23 వేలమందికి పైగా మహిళలు, యువతులు, బాలికలు అదృశ్యమయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం సమర్పించిన డేటా సంచలనంగా మారింది. అలాగే మహిళలపై అత్యాచారం, ఇతర నేరాలతో సంబంధం ఉన్న 1,500 మంది నిందితులు కూడా పరారీలో ఉన్నారని ఆ డేటాలో వెల్లడయ్యింది.
2024, జనవరి ఒకటి నుంచి 2025 జూన్ 30 మధ్య రాష్ట్రంలో నమోదైన అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులపై జిల్లాల వారీగా వివరణాత్మక డేటాను కోరుతూ సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలా బచ్చన్ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ ఆందోళనకర గణాంకాల వివరాలను వెల్లడించింది. అసెంబ్లీలో బాలా బచ్చన్..రాష్ట్రంలో ఒక నెలలో ఎంత మంది బాధితులు కనిపించకుండా పోయారు? ఎంత మంది నిందితులను అరెస్టు చేశారు? ఇంకా ఎంత మంది పరారీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఇటువంటి కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఏదైనా చర్య తీసుకున్నారా? అని కూడా ఆయన ప్రశ్నించారు.
దీనికి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఒక లిఖితపూర్వక ప్రకటనలో షాకింగ్ డేటాను షేర్ చేశారు. 2025, జూన్ 30 నాటికి ఏడాది కాలంలో రాష్రంలో మొత్తం 21,175 మంది మహిళలు, 1,954 మంది బాలికలు అదృశ్యమయ్యారు. రాష్ట్రంలో మొత్తంగా అదృశ్యమైన మహిళల సంఖ్య 23,129. అలాగే మహిళలపై అత్యాచారం చేసిన 292 మంది పురుషులు, మైనర్లపై అత్యాచారం చేసిన 283 మంది నిందితులు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా 575 మంది అత్యాచార నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన మొత్తం 443లో 167 మంది అరెస్టు నుండి తప్పించుకున్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో పరారీలో ఉన్న వారి సంఖ్య 610కి చేరుకుంది. మధ్యప్రదేశ్‌లో మహిళలు, బాలికలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన 1,500 మందికి పైగా నిందితుల ఆచూకీ తెలియడం లేదు. అదృశ్యమైన మహిళలకు సంబంధించి కొన్ని జిల్లాల్లో500కి పైగా కేసులు నమోదయ్యాయి.