ఇరుకైన హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం
11 మంది విదేశీయులుసహా 21 మంది సజీవదహనం
పలువురికి గాయాలు
35 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు
శిథిలంగా మారిన ఐదంతస్తుల భవంతి
ప్రాణాలను కాపాడుకునేందుకు చిన్నారితో మూడో అంతస్తు నుంచి దూకిన మహిళ
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ: నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నడుస్తూ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఢిల్లీలోని ఫ్లోరిష్ స్టే బీ అండ్ బీ హోటల్ బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మసిబొగ్గులా మారింది. తమ బంధువుల శస్త్రచికిత్సలు, వైద్యం కోసం విదేశాల నుంచి వచ్చి ఆస్పత్రి సమీప ఈ హోటల్‌లో బసచేస్తున్న పలువురు విదేశీయులు ఈ అగ్ని ప్రమాదంలో కాలిబూడిదయ్యారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో 11 మంది విదేశీయులు సహా మొత్తంగా 21 మంది సజీవదహనమయ్యారు.
మృతుల్లో 9 మంది ఆఫ్రికా దేశస్తులుకాగా ఇద్దరు తుర్క్‌మెనిస్తాన్ దేశస్తులు. పది మంది భారతీయులూ ఈ ఘటనలో చనిపోయారు. ఉదయంకావడంతో కొందరు నిద్రలోనే శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయారు. అగ్ని ప్రమాదం విషయం తెల్సి అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 35 మందిని కాపాడారు. వీరిలో 16 మందికి స్వల్ప గాయాలుకాగా 19 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.
హోటల్‌లోని అతిథులు, పోలీసులు, స్థానికులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు కలిపి మొత్తంగా 58 మంది ఈ ఘటనలో ప్రభావితమయ్యారు. ఘోర అగ్నిప్రమాదం వార్త తెలిసి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. సెన్సర్‌తో పనిచేసే తలుపులు మూసుకుపోయి బయటకురాలేక, అగ్నికీలల వేడిమికి తాళలేక హోటల్‌లోని అతిథులు కాపాడండి అంటూ చేసిన ఆక్రందనలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు.
హోటల్ జయమాని అరెస్టు
నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్వహిస్తూ ఈ ఘటనలో పలువురి మృతికి కారణమయ్యాడంటూ హోటల్ యజమాని లోకేశ్ బజాజ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. పరారీలో ఉన్న అతన్ని పోలీసులు రాత్రి పొద్దుపోయాక అరెస్టు చేశారు. ప్రమాదం వార్త తెలిసి రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. క్షతగాత్రులకు తలో రూ.50,000 మంజూరుచేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ సైతం మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
అసలేం జరిగింది?
దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లోని హౌజ్‌రాణి ప్రాంతంలో ఫ్లోరిష్ స్టే బీ అండ్ బీ హోటల్ ఒక ఐదంతస్తుల భవంతిలో నడుస్తోంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బ్రెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పథకంలో భాగంగా ఈ నివాస భవంతిని పేయింగ్ గెస్ట్ మాదిరిగా నడుపుతున్నారు. ఈ హోటల్‌లో కేవలం ఆరు గదులకు అనుమతి ఇవ్వగా నిబంధనలకు విరుద్ధంగా 25 గదుల్లో విదేశీయులకు వసతి కల్పించారు.
లైబీరియా, మొజాంబిక్, నైజీరియా, బంగ్లాదేశ్‌లకు చెందిన వ్యక్తులు ఈ హోటల్ గదుల్లో దిగారు. కిక్కిరిసిన హోటల్‌లో బుధవారం ఉదయం 8.30 గంటలకు ఉదయం హోటల్ కిచెన్‌లో చెఫ్ ఒక ఎలక్ట్రిక్ వస్తువును స్విచ్ఛాఫ్ చేశాక ఎలక్ట్రిక్ ప్లగ్ నుంచి మంటలొచ్చాయి. ఆర్పేలోపే గది అంతా మంటలు వ్యాపించి చివరకు భవనాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయని స్థానికుడు ఆసిఫ్ వెల్లడించాడు. క్షణాల్లో భవనం మొత్తాన్నీ అగ్నికీలలు చుట్టుముట్టాయి. సీల్ వేసిన కిటికీలు, ప్రతి అంతస్తులో సెన్సార్‌తో పనిచేసే తలుపులు అగ్నికీలల ధాటికి తెరుచుకోకపోవడంతో హోటల్‌లోని వాళ్లు తప్పించుకునేందుకు అవకాశం లేకుండాపోయింది.
చెలరేగుతున్న మంటల్ని చూసిన స్థానికులు, పరుపులు అమ్మే దుకాణదారు అర్మాన్ వెంటనే హోటల్ ముందు పరుపులు, దుప్పట్లను పరిచారు. కొందరు సాహసించి పైనుంచి వాటిపై దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మూడో అంతస్తు నుంచి ఒక చిన్నారితో మహిళ కిందకు దూకిన వీడియో వైరల్‌గా మారింది. నాలుగో అంతస్తు నుంచి ఒక విదేశీ జంట కిటికీ అద్దాలు బద్దలుకొట్టి కిందకు దూకేశారు. తీవ్ర గాయాలపాలైన వీళ్లను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రిలో చేరి్పంచారు.
పై నుంచి దూకిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దూకిన మొహమ్మద్ సాహిదుల్ ఇస్లాం, ఆరామిన్ జమాన్, రియానాలను ఆస్పత్రుల్లో చేరి్పంచారు. ప్రమాదం విషయం తెల్సి ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పలువురిని కాపాడి క్షతగాత్రులను సమీప ఆస్పత్రుల్లో చేరి్పంచారు. మృతులు, క్షతగాత్రుల్లో చాలా మంది మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాల వాళ్లే ఉన్నారు. ఆయా దేశాల రోగులు శస్త్ర చికిత్సలు, వైద్యం కోసం గతంలో సమీప ఆస్పత్రుల్లో చేరగా వాళ్ల బంధువులు ఈ ఫ్లోరిష్ బీ అండ్ బీ హోటల్‌లో దిగగా అనూహ్యంగా ఈ అగ్నిప్రమాదం బారిన పడ్డారు.
ఆస్పత్రుల్లో విషాద దృశ్యాలు
వైద్యం చేయించుకునేందుకు తాము వస్తే తమకు సాయపడేందుకు వెంట వచ్చిన బంధువులు విగతజీవులుగా మారారని తెల్సి సమీప మ్యాక్స్, సఫ్డర్‌జంగ్, ఎయిమ్స్, పండిత్ మదన్‌మోహన్ మాళవీయ ఆస్పత్రుల్లోని రోగులు కన్నీటిపర్యంతయ్యారు. తమ వాళ్లు అగ్నికీలలకు బలయ్యారని తెల్సి బంధువులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ‘‘నా అల్లుడు, కూతురు తరిణి అగర్వాల్(42), 17, 20 ఏళ్ల మనవరాళ్లు ఇదే హోటల్‌లో దిగారు. మంటల్లో అల్లుడు చనిపోయాడు. ఇప్పుడు కుమార్తె, మనవరాళ్ల జాడ తెలీడం లేదు’’అని ఒకతను కన్నీటిపర్యంతయ్యాడు. అగ్నికీలలు అంటుకున్న గంట తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఇదే హోటల్‌లో దిగిన మా బంధువులు ఆరుగురూ చనిపోయారు. నలుగురి మృతదేహాలను గుర్తుపట్టా. మిగతా ఇద్దరి మృతదేహాలు ఎక్కడున్నాయో ఎవరూ చెప్పడం లేదు’’అని నమిత్ గోయల్ అని వ్యక్తి ఏడుస్తూ చెప్పారు.
అడుగడుగునా నిబంధనలు బేఖాతరు
హోటల్‌ను తర్వాత ఢిల్లీ ప్రభుత్వంలోని పలు విభాగాల ఉన్నతాధికారులు పరిశీలించగా అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన కని్పంచింది. ఇరుకైన దారిలో నిర్మించిన ఈ ఐదంతస్తుల భవనం లోపలికి వెళ్లడానికి బయటకు రావడానికి కేవలం ఒక్కటే ద్వారం ఉంది. ఏడేళ్ల క్రితం ఒక్కటే పై అంతస్తు ఉండగా ఇటీవలే అనుమతుల్లేకుండా మిగతావి కట్టేశారు. ధారాళంగా గాలి వెలుతురు రాకుండా గదుల కిటికీలను సీల్‌వేసి ఉన్నాయి. పై అంతస్తుల్లో సెన్సర్‌తో పనిచేసే తలుపులు బిగించారు. అగ్నికీలలకు విద్యుత్ వైర్లన్నీ కాలిపోవడంతో సెన్సార్‌లు పనిచేయక తలుపులు తెరచుకోలేదు. దీంతో లోపల ఉన్న వాళ్లు మంటలకు, దట్టమైన పొగకు చనిపోయారు.
ఆరు గదులకు అనుమతి ఇస్తే పాతిక గదులను నిర్మించి హోటల్‌ను అతిథులతో నింపేశారు. భవంతికి ఎలాంటి అగ్నిమాపకశాఖ నిరభ్యంతర సరి్టఫికేట్(ఎన్‌ఓసీ) లేదు అని చీఫ్ ఫైర్ ఆఫీసర్ అఖిలాష్ మాలిక్ వెల్లడించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో రెస్టారెంట్ నడుపుతున్నారు. బేస్‌మెంట్ మొదలు పై అంతస్తు, టెర్రస్‌దాకా మొత్తం గదులతో నింపేశారని స్థానికుడు షేక్ అలీ వెల్లడించారు. మంటలు వ్యాపించడంతో స్థానికులు ప్రధాన ద్వారం, కిటికీలను రాళ్లు, సుత్తితో పగలగొట్టి కొందరిని బయటకు లాగారు. 17 అగ్నిమాపక బృందాలు ఘటనస్థలికి చేరుకుని ఎట్టకేలకు మంటల్ని ఆర్పేశాయి. అతిథులను కాపాడే క్రమంలో 10 మంది పోలీసులు గాయపడ్డారు. వీళ్లను ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో చేరి్పంచారు.


