
మంగళూరు: అది 2010, మే 22.. కర్నాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం(Mangalore International Airport)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమాన ప్రమాదం జరిగి నేటికి (మే 22, 2025) 15 ఏళ్లు పూర్తయ్యింది.
నాడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం(Air India Express flight) 812లో ప్రయాణం సాగించిన 166 మంది ప్రయాణికులలో ఎనిమిది మంది మాత్రమే ప్రాణాలతో బతికి బట్టకట్టగలిగారు. భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఇది ఒకటిగా నిలిచింది. దర్యాప్తు దరిమిలా వెలువడిన వివరాల ప్రకారం విమాన కెప్టెన్ ల్యాండింగ్ విషయంలో చేసిన తప్పిదమే ప్రమాదానికి కారణమని వెల్లడయ్యింది. రన్‌వే ఓవర్‌షూట్ అయిన విమానం కొండవాలు నుండి పడగానే, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయపు రన్‌వే మిగతావాటితో పోలిస్తే చిన్నదిగా ఉంటుంది.
నాడు ప్రమాదానికి గురైన విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వచ్చింది. ల్యాండింగ్ నుండి 2,000 అడుగుల దూరంలో ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో అది రన్‌వే 24 ప్రారంభం నుండి 5200 అడుగుల ఎత్తులో ల్యాండింగ్(Landing) ప్రారంభించింది. అది ఆపడానికి 2,800 అడుగులు మాత్రమే ఇంకా మిగిలి ఉంది. అయితే అది అంతలోనే ఇసుక అరెస్టర్ బెడ్ గుండా దూసుకెళ్లింది. దాని రెక్కలు యాంటెన్నాలను ఢీకొని కొండపై పడిపోయాయి. వెంటనే మంటలు విమానాన్ని చుట్టుముట్టాయి. ఈ విమాన ప్రమాదంలో మొత్తం 158 మంది ప్రాణాలు కోల్పోయారు.
నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందించారు. అలాగే అప్పటి కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షల పరిహారం ప్రకటించారు. ఇదేవిధంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించింది.
ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’కు నెల.. ముష్కరుల వేటలో ఎన్‌ఐఏ