
పహల్గామ్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam)లో ఏప్రిల్ 22న 25 మంది పర్యాటకులను, ఒక స్థానికుడిని హతమార్చిన ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ముమ్మరంగా గాలిస్తోంది. ఈ దాడి జరిగి నేటికి (మే 22)కు నెలరోజులయ్యింది. ఈ ఘటన భారత్ - పాకిస్తాన్ మధ్య శత్రుత్వాన్ని మరింతగా పెంచింది.
ఈ దాడి జరిగిన దరిమిలా జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి ఫిర్యాదు అందుకున్న ఎన్‌ఐఏ ప్రస్తుతం సాక్షులను విచారిస్తోంది. అలాగే అందుబాటులో ఉన్న డేటాను పరిశీలిస్తోందని సమాచారం. ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదుల హస్తం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపధ్యంలో సంబంధిత అధికారులు ముగ్గురు ఉగ్రవాదుల(terrorists) స్కెచ్‌లను విడుదల చేశారు. వారి గురించిన సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షల రివార్డును ప్రకటించారు. మరోవైపు ఎన్‌ఐఏ అధికారులు ఇప్పటివరకూ ఫోన్ ఆపరేటర్లు, దుకాణదారులు, ఫోటోగ్రాఫర్లు, సాహస క్రీడలలో పనిచేసేవారితో సహా 150 మంది స్థానికులను విచారించారని ఒక అధికారి తెలిపారు.
ఈ ఘటనకు 15 రోజుల ముందు ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా దుకాణాన్ని మూసివేసిన దుకాణదారుడిని కూడా ఎన్‌ఐఏ విచారించింది. కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ డంప్ డేటాను సేకరించింది. వీటిలో అధికంగా బాధితుల కుటుంబ సభ్యులు, పర్యాటకులు తీసిన వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. ఇవి దాడి చేసినవారు ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్లిపోయారో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని ఒక అధికారి తెలిపారు. 2019 పుల్వామా దాడి(Pulwama attack) దర్యాప్తు సమయంలో ఎన్‌ఐఏ త్రీడీ మ్యాపింగ్‌ను తయారు చేసింది. ఇప్పుడు కూడా అదే తరహా మ్యాపింగ్‌తో దర్యాప్తు సాగిస్తోందని సమాచారం. మరోవైపు జమ్ముకశ్మీర్ పోలీసులు భారీ స్థాయిలో దాడులు నిర్వహించి, వందలాది మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీని గురించి పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ రెండు రోజుల పాటు దాడులు నిర్వహించి, పలువురిని అదుపులోనికి తీసుకుని విచారించామన్నారు. వారిలో చాలా మందిని విడుదల చేశామని కూడా తెలిపారు. కాగా దాడి జరిగిన దరిమిలా భద్రతా సంస్థలు.. ఈ ఘాతుకానికి పాల్పడిన ముష్కరుల పాదముద్రలను గుర్తించగలిగాయని ఒక అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: ప్రమాదం బారిన జీవవైవిధ్యం