పేరపళ్లలో భూ రీ–సర్వే | - | Sakshi
Sakshi News home page

పేరపళ్లలో భూ రీ–సర్వే

Aug 21 2026 7:45 AM | Updated on Aug 21 2026 7:45 AM

నారాయణపేట: మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతలకు 326.34 ఎకరాల భూ సేకరణ జరుగుతున్న వేళ మండలంలోని పేరపళ్లలో భూముల సర్వే వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. భూ భారతి రికార్డుల్లో వివరాలు ఒకలా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటం అధికారులకు కొత్త చిక్కులు తెచ్చింది. పలు సర్వేనంబర్లలో రికార్డులు, భౌతిక అనుభవం సరిపోలక భూ సేకరణ, పరిహారం చెల్లింపులో జాప్యం తలెత్తే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక దిశా నిర్ధేశంతో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌.శ్రీను పేరపళ్లలో సమగ్ర పునః సర్వేకు ఆదేశిస్తూ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే, సెటిల్‌మెంట్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌శాఖ మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్థాయిలో భూముల కొలతలు చేసి వాస్తవ అనుభవాన్ని నమోదు చేయనున్నారు. జియో–రెఫరెన్‌న్స్‌ కొలతలు, ఫొటోలు, జియో–ట్యాగ్డ్‌ ఆధారాలతో రికార్డులను పరిశీలించి వ్యత్యాసాలున్న చోట సబ్‌–డివిజన్‌ స్కెచ్‌లు సిద్ధం చేయనున్నారు.

సెప్టెంబర్‌ 5లోగా పూర్తికి..

భూముల పునః సర్వే కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సెప్టెంబర్‌ 5లోగా సర్వే ప్రక్రియను పూర్తిచేసి తుది అసమతుల్యత, ఉపవిభజన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రతి బృందం ఉదయం 8 గంటలకే గ్రామానికి చేరుకొని కేటాయించిన పని పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి సర్వేనంబర్‌లో ఎవరు ఉన్నారో గుర్తించి వారి సమక్షంలో భూమి ఫొటోలు తీయనున్నారు. ఆక్రమణలు, విస్తీర్ణ వ్యత్యాసాలున్న చోట ప్రత్యేక ఉప విభజన రికార్డులు రూపొందించనున్నారు. ప్రభు త్వ భూములు, ఎంఎన్‌కేఎల్‌ఐఎస్‌ పరిధిలోని నోటిఫైడ్‌ భూములు కూడా సర్వేలో పరిశీలిస్తారు.

రోజువారీగా నివేదిక..

రోజు నిర్వహించిన సర్వే, భూ వివరాలు, స్కెచ్‌లను అదేరోజు సాయంత్రం ఆర్డీఓకు సమర్పించాలి. పునః సర్వే పురోగతిని ఆర్డీఓ, డీఎస్‌ఓ (ఎస్‌అండ్‌ఎల్‌ఆర్‌)లు పర్యవేక్షించనున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ హెచ్చరించారు. పేరపళ్లలో చేపడుతున్న ఈ రీ–సర్వే భూ సేకరణకు మాత్రమే కాకుండా రికార్డులు, హద్దులు, వాస్తవ అనుభవంపై ఉన్న వ్యత్యాసాలకు కూడా పరిష్కారం చూపే కీలక ప్రక్రియగా మారనుంది.

326.34 ఎకరాల సేకరణ..

ఎంఎన్‌కేఎల్‌ఐఎస్‌ స్టేజ్‌–1 (జూరాల ట్యాంక్‌) ప్రాజెక్టు కోసం పేరపళ్లలో 326.34 ఎకరాల భూ సేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్‌న్‌ ఇప్పటికే జారీ అయింది. అయితే భూ సేకరణకు సంబంధించి క్షేత్ర పరిశీలన, జాయింట్‌ సర్వే సందర్భంగా సర్వేనంబర్లు 56, 81, 82, 83, 85, 87, 660, 662, 663, 664 తదితరాల్లో భూ భారతి రికార్డులు, వాస్తవ అనుభవం మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి..

భూ రికార్డుల్లో ఉన్న చైన్‌ సిస్టమ్‌ కారణంగా రికార్డుల్లోని వివరాలు, వాస్తవ భూమి అనుభవానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రభావం భూ సేకరణ సర్వేనంబర్లకే కాకుండా గ్రామంలోని సాధారణ భూ రికార్డులపైనా ఉన్నట్లు తెలిపారు. దీంతో భూ సేకరణకు పట్టాదారుల సమ్మతి, పరిహారం చెల్లింపులో జాప్యం జరిగే అవకాశం ఉండటంతో శాఖ నిబంధనల ప్రకారం సర్వేయర్‌, లైసెనన్స్‌డ్‌ సర్వేయర్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సంయుక్తంగా రీ–సర్వే చేపట్టి క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. దీంతో భూ సేకరణతో పాటు పట్టాదారుల హక్కుల పరిష్కారానికి మార్గం సుగమం కానుంది.

తప్పిదాలకు తావులేకుండా..

భూ సేకరణ సర్వే ప్రక్రియపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్డీఓ రమేష్‌ సర్వేయర్లు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని, ప్రతి వివరాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భూ హద్దుల విషయంలో ఒక్క తప్పిదం జరిగినా భవిష్యత్‌లో మరో వివాదానికి దారితీసే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా సర్వే చేయాలని సూచించారు. ఒకవైపు భూములపై హక్కులు, మరోవైపు రికార్డుల్లోని వివరాలు.. మధ్యలో సర్వే వివాదం. ఈసారి నాలుగు బృందాలతో చేపడుతున్న సర్వే అయినా పేరపళ్ల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందా? అన్నదే ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

నాలుగు బృందాలు.. 15 రోజుల పాటు...

భూ రికార్డుల్లో గందరగోళంతో సమగ్ర పునః సర్వేకు శ్రీకారం

326.34 ఎకరాల ‘మక్తల్‌––పేట–కొడంగల్‌’ భూ సేకరణపై ప్రభావం

నేటి నుంచి ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement