నారాయణపేట ఎడ్యుకేషన్: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం జేపీకాలనీలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఈ నెల 11న అదే పాఠశాలకు చెందిన విద్యార్థులు అతి దారుణంగా హత్య చేసిన ఘటనను సంఘం జిల్లాశాఖ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్రస్మా నారాయణపేట జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రశాఖ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడంతో పాటు పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం సాయంత్రం జిల్లా విద్యాధికారి గోవిందరాజుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజేష్‌కుమార్, ఈసీ సభ్యుడు మహేష్, పట్టణ అధ్యక్షుడు ఖదీర్ పాల్గొన్నారు.
23న జిల్లా మహిళా కబడ్డీ జట్టు ఎంపిక
నారాయణపేట: సూర్యాపేట జిల్లా కోదాడలో సెప్టెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు జరిగే 73వ తెలంగాణ రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ టోర్నీలో పాల్గొనే జిల్లా మహిళా కబడ్డీ జట్టును 23వ తేదీన ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషనన్ అధ్యక్షుడు జి.నాగేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి సి.వెంకటప్ప గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో ఆదివారం ఉదయం 9 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని.. ఆసక్తి గల మహిళా క్రీడాకారులు పాల్గొనాలని పేర్కొన్నారు. 75 కిలోలలోపు బరువు ఉండాలని, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్ 99591 86668, 94914 89754 సంప్రదించాలన్నారు.
131.279 మి.యూ. విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగంగా కొనసాగుతోందని ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. గురువారం ఎగువన 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 73.297 మి.యూ., దిగువన 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 57.982 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటి వరకు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో 131.279 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తికి 40 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి వదులుతున్నామన్నారు.
విద్యార్థుల భవిష్యత్‌కు
బలమైన పునాది వేయాలి
మహమ్మదాబాద్: విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని ఆర్జేడీ సోమిరెడ్డి సూచించారు. గురువారం మహమ్మదాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు బలమైన పునాది కల్పిస్తూ.. పాఠ్యాంశాలపై ఆసక్తి పెరిగేలా బోధనలో నూతన పద్ధతులు అవలంబించాలని సూచించారు. చదువుతోపాటు సంస్కారం, క్రమశిక్షణ అలవర్చాలన్నారు. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి పాఠశాల ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. మహమ్మదాబాద్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని దుకాణ సముదాయం అద్దెల ద్వారా వచ్చే ఆదాయాన్ని నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని ఆర్జేడీ సూచించారు. నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు రావడంతో పాఠశాలను సందర్శించిన ఆయన ఆదాయ, వ్యయ వివరాలను పరిశీలించారు. వచ్చిన ప్రతి రూపాయి, చేసిన ఖర్చుపై ఆడిట్ ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఓ రాజునాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


