నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు

Aug 21 2026 7:45 AM | Updated on Aug 21 2026 7:45 AM

నారాయణపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్‌ విమర్శించారు. గురువారం జిల్లాకేంద్రంలోని మున్సిపల్‌ పార్క్‌ సమీపంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యపై నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి రాకముందు ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని.. ఆ హామీని అమలు చేయకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా లక్షలాది ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య దేశ అభివృద్ధికి ఆటంకంగా మారుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు రూ.5 వేల నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు జాబ్‌ క్యాలెండర్‌, యూత్‌ డిక్లరేషన్‌ ప్రకటిస్తున్నప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదన్నారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. డిగ్రీ, పీజీ, బీఈడీ, టెక్నికల్‌ కోర్సులు పూర్తి చేసిన యువత సర్టిఫికెట్లు పట్టుకుని ఉద్యోగాల కోసం తిరుగుతున్న దుస్థితి నెలకొందన్నారు. ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, ఎలాంటి వివాదాలకు తావులేని విధంగా నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వివిధ డిమాండ్ల వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్‌ రామకృష్ణకు అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోపాల్‌, బండమీది బలరాం, అంజిలయ్యగౌడ్‌, జ్యోషి, మహేష్‌కుమార్‌గౌడ్‌, కాశప్ప, నరహరి, దస్తప్ప, అశోక్‌, శివకుమార్‌, మల్లేష్‌, కనకప్ప, సోఫీ, మజార్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement