అసలేం జరుగుతోంది?! | - | Sakshi
Sakshi News home page

అసలేం జరుగుతోంది?!

Aug 21 2026 9:38 AM | Updated on Aug 21 2026 9:38 AM

రైతులకు న్యాయం చేస్తున్నాం..

పాసు పుస్తకాలపై అనుమానాలు..

నారాయణపేట: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో భాగంగా పేరపళ్ల భూ సేకరణ వ్యవ హారం చుట్టూ రాజకీయ వేడి రాజుకుంది. భూ సేకరణలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వస్తు న్న ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు లోకాయుక్తను ఆశ్రయించగా.. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ బీజేపీ పోరాటానికి సిద్ధమని హెచ్చరిస్తోంది. మరోవైపు భూ సేకరణలో రైతులకు న్యాయం చేస్తున్నామని కాంగ్రెస్‌ స్పష్టం చేస్తోంది. దీంతో ఆ భూముల వ్యవహారంలో అసలు వాస్తవం ఏమిటి? అన్నది ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

రాజకీయ దుమారం..

నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూ సేకరణలో పేరపళ్ల గ్రామం కీలకంగా మారింది. భూముల సర్వే, రికార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు, పరిహారం చెల్లింపుపై రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలను వివిధ రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. భూ సేకరణలో అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ వస్తున్న ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి ఈ నెల 13న లోకాయుక్తకు ఫి ర్యాదు చేసింది. భూ సేకరణ ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరారు. ఈ వ్యవహారం రాజకీయ విమర్శల స్థాయి నుంచి విచారణ డిమాండ్‌ వరకు వెళ్లింది.

రైతుల పక్షాన

బీజేపీ హెచ్చరికలు..

బీజేపీ రాష్ట్ర నేత నాగూరావు నామాజీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు సత్యయాదవ్‌ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పేరపళ్లలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. భూములు కోల్పోతున్న రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సర్వేనంబర్ల వారీగా భూ ముల వాస్తవ పరిస్థితిని పరిశీలించి అర్హులైన రైతులకే పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ సర్వేనంబర్లే కీలకం..

పేరపళ్ల భూ వ్యవహారంలో ప్రధానంగా 11, 87, 92, 101 సర్వేనంబర్లపైనే చర్చ జరుగుతోంది. ఈ సర్వేనంబర్లలో వాస్తవంగా సాగులో ఉన్న రైతులు ఎవరు? రికార్డుల్లో భూమి యజమానులు ఎవరు? భూ సేకరణకు సంబంధించి ఎవరికి నోటీసులు ఇచ్చారు? పరిహారం ఎవరికి మంజూరైంది? అన్నది తేలాల్సి ఉంది.

రిజర్వాయర్‌గా మారనున్న పేరపళ్ల జాయమ్మ చెరువు

డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి బుధవారం పేరపళ్ల రైతువేధికకు చేరుకొని భూములు కోల్పోతున్న రైతులతో ముఖముఖి నిర్వహించారు. రైతులు తమ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎకరాల భూములు పోతుంటే మిగిలిన గుంట, రెండు, మూడు గుంటలు ఏం చేసుకోవాలని రైతులు తెలిపారు. ఇంకొందరు రైతులు తమ భూములు గుట్టపై ఉన్నాయని.. రిజర్వాయర్‌ నిర్మాణం తర్వాత అక్కడికి వెళ్లేందుకు రహదారి ఉండదని చెప్పుకొచ్చారు. తమకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరారు. రైతుల సమస్యలు విన్న తర్వాత శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. భూ సేకరణ ప్రక్రియలో ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులకు అన్యాయం జరగకుండా రీ సర్వే చేయించి హద్దులు నిర్ణయించి నిబంధనల ప్రకారమే సర్వేలు, భూ సేకరణ, పరిహారం ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. పేరపళ్లలో ఇప్పటికే 326 ఎకరాల భూ సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. అదనంగా మరో 92 ఎకరాలు కావాల్సి ఉందని అధికారులు చెప్పడంతో వాటిని సైతం రైతులు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. రిజర్వాయర్‌ పక్కన భూములుంటే భవిష్యత్‌లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే తమ రాజకీయ మనుగడ కష్టమవుతుందనే ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పార్టీలకతీతంగా అందరూ కలిసి రావాలని గ్రామ రైతులు, ప్రజలను కోరుతున్నామన్నారు.

కొత్త పట్టాదారు పాసు పుస్తకాల జారీపై కూడా రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 100 ఎకరాలకు సంబంధించి కొత్త పాసు పుస్తకాలు వస్తున్నాయనే ప్రచారం నేపథ్యంలో రికార్డులపై స్పష్టత ఇవ్వా లని రైతులు కోరుతున్నారు. పాత రికార్డులు, ప్రస్తుత రికార్డులను అధికారులు పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

పేరపళ్ల భూముల చుట్టూ నేతల రాజకీయం

ఎత్తిపోతల భూ సేకరణపై

మూడు పార్టీలు.. మూడు వాదనలు

అవినీతి, అక్రమాల ఆరోపణలపై లోకాయుక్తను ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌

రైతులకు అన్యాయం జరిగితే

పోరాటమేనంటున్న బీజేపీ

నిబంధనల మేరకే భూ సేకరణ..

రైతులకు న్యాయం

చేస్తున్నామంటున్న కాంగ్రెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement