మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి అవసరమైన నిర్వహణ, ల్యాబ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాంపోజిట్ గ్రాంట్ కింద రూ.40 లక్షలు, ల్యాబ్‌ల నిర్వహణకు రూ.33.24 లక్షలు.. మొత్తం రూ.73.24 లక్షలు కేటాయించింది. ఈ మొత్తాన్ని ఇప్పటికే కళాశాలల ప్రిన్సిపాళ్ల ఖాతాల్లో జమ చేసింది. కాంపోజిట్ గ్రాంట్‌ను స్టేషనరీ, తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అవసరాలకు వినియోగించనున్నారు. ల్యాబ్ నిధులతో సైన్స్ ప్రాక్టికల్స్‌కు అవసరమైన పరికరాలు, రసాయనాలు, ఇతర సామగ్రిని సమకూర్చుకోనున్నారు. వచ్చే జనవరి, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ నిర్వహించే సమయంలో ఇబ్బందులు లేకుండా ముందుగానే నిధులు అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా ఉంటుందని కళాశాలల ప్రిన్సిపాళ్లు పేర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న కళాశాలలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారు. బాలికల జూనియర్ కళాశాల, ఎంవీఎస్ జూనియర్ కళాశాలలకు ల్యాబ్ నిర్వహణకు రూ.లక్ష చొప్పున అందినట్లు అధికారులు తెలిపారు.
జిల్లా కళాశాలలు కాంపోజిట్ ల్యాబ్
గ్రాంట్ నిధులు
జోగుళాంబ గద్వాల 8 5.50 4.80
మహబూబ్‌నగర్ 15 12.25 9.40
నాగర్‌కర్నూల్ 16 9.25 6.20
నారాయణపేట 10 6.50 6.20
వనపర్తి 12 6.50 6.64
61 ప్రభుత్వ కళాశాలలకు కాంపోజిట్, ల్యాబ్ నిర్వహణ గ్రాంట్లు
విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.73.24 లక్షల కేటాయింపు
విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నిధులు విడుదల చేయడం ఇదే తొలిసారి
విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నిధులు
జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కాంపోజిట్, ల్యాబ్ నిర్వహణ నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు కేటాయించారు. కళాశాల, ల్యాబ్‌ల నిర్వహణకు మంజూరైన నిధులను నిబంధనల మేరకు వినియోగించుకోవాలి. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నిధులు విడుదల చేయడం అభినందనీయం.
– రమణి, డీఐఈఓ


