కాలిపోయిన పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ | - | Sakshi
Sakshi News home page

కాలిపోయిన పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

Jul 22 2026 2:11 AM | Updated on Jul 22 2026 2:11 AM

132 కేవీ సరఫరా నిలిపివేత

మక్తల్‌ 33 కేవీ సబ్‌స్టేషన్‌లో ఘటన

8 గంటలపాటు విద్యుత్‌ సరఫరా

అంతరాయం

4 సబ్‌స్టేషన్లపై ప్రభావం

త్రీఫేజ్‌ కరెంట్‌ లేక రైతుల అవస్థలు

నారాయణపేట/మక్తల్‌: వర్షం.. ఈదురుగాలులు.. విద్యుత్‌ లైన్లు తెగిపడటంతో పెరిగిన లోడ్‌ వెరసి మక్తల్‌ 33 కేవీ సబ్‌స్టేషన్‌లో సోమవారం రాత్రి పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. దీంతో 8 గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఈ నవీన్‌కుమార్‌ మక్తల్‌ సబ్‌స్టేషన్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. మంగళవారం ఉదయం నుంచి విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను క్రేన్‌ సాయంతో తొలగించి, దాని స్థానంలో కొత్త పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు.

రైతులకు త్రీఫేజ్‌ కష్టాలు

విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో వ్యవసాయ బోర్లకు త్రీఫేజ్‌ కరెంట్‌ అందలేదు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు పలు చోట్ల వానలు కురవడంతో పంటల సాగు పనులు ఊపందుకుంటున్న సమయంలో విద్యుత్‌ అంతరాయం రైతులను ఇబ్బందులకు గురిచేసింది. బోర్లు నడవకపోవడంతో కరిగెట చేసే పనులు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

8 గ్రామాలకు..

ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతో మక్తల్‌, చందాపూర్‌, దాసర్‌పల్లి, వన్నాయకుంట, తిర్మలాపూర్‌, సంగంబండ, గుర్లపల్లి, రుద్రసముద్రం, దండు తదితర గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సోమవారం రాత్రి 10 గంటల తర్వాత ఇతర పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో కొన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.

కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు సమయంలో ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా 132 కేవీ విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఊట్కూర్‌, నేరడుగం, లింగంపల్లి, మక్తల్‌ సబ్‌స్టేషన్ల పరిధిలో ఉదయం 10.20 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement