నారాయణపేట: జిల్లాకేంద్రంలో మైనర్ బాలుడి తో పనులు చేయిస్తున్న యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపరేషన్ ముస్కాన్ 12లో భాగంగా చైల్డ్ హెల్ప్‌లైన్, పోలీసులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివ రాల ప్రకారం.. ఈ నెల16న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నారాయణపేట పట్టణంలో ని ఎంబీసీ చర్చి ఎదురుగా ఉన్న యాభైరోడ్డులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఆటో మెకానిక్ షెడ్డులో మైనర్ బాలు డు పనిచేస్తున్నట్లు గుర్తించారు. విచారణలో బాలుడి వయసు 16 ఏళ్లు అని, అతడు పెద్దజట్రం గ్రామానికి చెందినవాడని అధికారులు నిర్ధారించారు. దీంతో బాలుడిని అక్కడి నుంచి రక్షించి, తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు.
యజమానిపై కేసు నమోదు
మైనర్ బాలుడిని పనిలో పెట్టుకున్న యజమానిని విచారించగా కర్ణాటకకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మైనర్‌ను పనిలో పెట్టుకున్న ఘటనపై మంగళవారం బీఎన్‌ఎస్ సెక్షన్ 146, జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 79 తదితర నిబంధనల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం
బాలలను పనుల్లో పెట్టుకోకుండా, వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఆపరేషన్ ముస్కాన్ 12 కొనసాగుతోందని అధికారులు తెలిపారు. బాల కార్మికులను గుర్తించి, రక్షించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. బాలలతో పనులు చేయిస్తున్నట్లు సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్ బాల్‌రాజ్, పోలీసు సిబ్బంది, విజయ్, ఎన్జీఓ ప్రతినిధులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.


