కరువు.. ఛాయలు | - | Sakshi
Sakshi News home page

కరువు.. ఛాయలు

Jul 22 2026 2:11 AM | Updated on Jul 22 2026 2:11 AM

ప్రశ్నార్థకంగా మారుతున్న జూరాల ఆయకట్టు సాగు

సాగునీటి కోసం అన్నదాత

ఎదురుచూపు

వర్షాలు కురవక నోరెళ్లబెట్టిన

జలాశయం

జిల్లాలో 85 వేల ఎకరాల

ఆయకట్టుపై ప్రభావం

అమరచింత: ప్రస్తుత ఖరీప్‌ సాగుపై అన్నదాతల్లో ఆందోళన మొదలయింది. వానాకాలం సీజన్‌ అర్ధభాగం ముగిసినా ఇప్పటికీ జలాశయాలు నోరెళ్లబెట్టి ఉన్నాయి. మునుపెన్నడు లేని విధంగా ఈ ఏడాది జూరాల ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు దాపరించాయి. ఆరుద్ర కార్తీ నాటికి వరి నాడుమడులు సిద్ధం చేసుకుని వరినాట్లను వేసుకునే పనుల్లో నిమగ్నమయ్యే ఆయకట్టు రైతులు నేడు సాగునీటి కోసం కళ్లలో ఒత్తులు పెట్టుకుని మేఘాల వైపు ఆశగా చూసే దుస్థితి నెలకొంది. ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వానాకాలంలో పంటలకు సాగునీరు అందని దాఖలాలు లేవని అన్నదాతలు అంటున్నారు. జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలో 1.20 లక్షల ఎకరాలు సాగులోకి వస్తున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించి, యాసంగి సాగులో మాత్రం కొంత ఆయకట్టుకు కోతలు విధించేవారు.

వారాబందీ పద్ధతిలో..

పదేళ్లుగా ప్రాజెక్టు అధికారులు సాగునీటి విడుదల విషయంలో పొదుపు చర్యలు పాటిస్తూ.. వారబందీ విధానం ప్రవేశపెట్టి వారంలో కేవలం 4 రోజులు మాత్రం నీరు ఆయకట్టుకు వదిలేవారు. మూడేళ్లుగా ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గుతుండటంతో ఎడమ కాల్వ పరిధిలో 20 వేల ఎకరాలు, కుడికాల్వ పరిధిలో 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించి మిగిలిన ఆయకట్టుకు క్రాప్‌ హలీడే ప్రకటించేవారు. గత యాసంగిలో సైతం కుడి, ఎడమ కాల్వల పరిధిలో 35 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని వదిలారు.

ఎడమ కాల్వ పరిధిలోనే..

జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోనే 85 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అమరచింత, ఆత్మకూర్‌, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల వరకు సుమారు 35 కిలోమీటర్ల పొడవునా ఎడమ కాల్వ విస్తరించి ఉంది. ఎడమ కాల్వ వెంట సాగునీటిని విడుదల చేస్తేనే వీపనగండ్ల మండలంలోని గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు సైతం నీరు చేరే అవకాశం ఉండడంతో అక్కడి రైతులు సాగుపై అయోమయంలో ఉన్నారు.

భూములు కోల్పోయిన వారికే సాగునీరు లేదు

జూరాల ప్రాజెక్టు నిర్మాణంలో భూమలను కొల్పోయిన నందిమల్ళ, ములమళ్ళ గ్రామాల రైతులకు సాగునీరును ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సమాంతర కాల్వ పేరిట ప్రాజెక్టులో ఉన్న నీటిని ముందు మండలాలకు తరలించుకుని వెలుతున్న పట్టించుకునే పాలకులే కరువయ్యారు. నీటి తరలింపు వ్యవహరంలో తమ రైతుల పొట్టకొట్టి వ్యవసాయంకు దురం చేస్తున్నారు.

– భాస్కర్‌రెడ్డి, రైతు, నందిమళ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement