సమన్వయంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ

Jul 18 2026 9:27 AM | Updated on Jul 18 2026 9:27 AM

ఈపాస్‌ యంత్రాలతో ఎరువులు విక్రయించాలి

నారాయణపేట: జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్పీ డా. వినీత్‌ సమక్షంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్లను గుర్తించి వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలన్నారు. రహదారులపై రిఫ్లెక్టర్లు, రంబుల్‌ స్ట్రిప్స్‌, పక్కనే హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌ లిమిట్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలల పరిసరాలను సేఫ్టీ జోన్‌లుగా అభివృద్ధి చేసి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించి పాదచారులకు సౌకర్యవంతమైన మార్గాలు కల్పించాలని, ప్రధాన రహదారులపై పార్కింగ్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతిశాఖ తమ పరిధిలో చేపట్టిన రోడ్డు భద్రత పనుల పురోగతిని సకాలంలో నివేదికల రూపంలో సమర్పించాలన్నారు. ప్రమాద సమయంలో బాధితులకు అత్యవసర వైద్యం వేగంగా అందేందుకు 108 అంబులెనన్స్‌ సేవలను బలోపేతం చేయాలని, జాతీయ రహదారులపై అవసరమైన చోట అదనపు అంబులెన్సులు, అత్యవసర స్పందన కేంద్రాల ఏర్పాటుపై పరిశీలన చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ప్రమాద బాధితులకు సాయం చేసే గుడ్‌ సమారిటన్‌ పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించి సాయం చేసే వ్యక్తులను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు నిరంతర అవగాహన కల్పించాలని సూచించారు. అతివేగం, డ్రంకెన్‌ డ్రైవ్‌, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ నిబంధనల ఉల్లంఘనలు, మైనర్ల డ్రైవింగ్‌, ఫిట్‌నెస్‌ లేని వాణిజ్య వాహనాలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు. గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో రోడ్డు భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సమావేశంలో రవాణా, పోలీసు, రోడ్లు, భవనాలు, జాతీయ రహదారులు, ఆర్టీసీ, 108 అంబులెన్స్‌ సేవలు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

దామరగిద్ద: రైతులకు అవసరమైన ఎరువులను ఈ పాస్‌ యంత్రంలో ఆధార్‌ నమోదుతో విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌ ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆగ్రోస్‌, హాకా రైతు సేవాకేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, ఎరువులు, వరి నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో బెట్ట పరిస్థితులు నెలకొన్నందున వర్షాధారంగా సాగు చేసిన పెసర, కంది, పత్తి, జొన్న పంటలను సంరక్షించుకోవడంపై సూచనలు చేశారు. దుకాణాలకు వచ్చే రైతులకు వర్షాభావ పరిస్థితులు, పంటల సంరక్షణ, ప్రత్యామ్నాయ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వానాకాలం పంటలకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి బాలాజీ ప్రసాద్‌, ఏఈఓ గోపాల్‌ ఉన్నారు.

న్యాయవాదుల నిరసన

మక్తల్‌: నర్వ మండలం ఉందేకోడ్‌కు చెందిన న్యాయవాది నీరజ్‌పై దాడికి నిరసనగా శుక్రవారం మక్తల్‌ న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన తెలిపారు. న్యాయవాదిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా విధులకు హాజరు కావడం లేదని జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు దత్తాత్రేయ, తిమ్మన్న, శ్రీనివాస్‌, సూర్యప్రకాశ్‌, ఆనంద్‌, రవికుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement