సన్నబియ్యానికి రెక్కలు! | - | Sakshi
Sakshi News home page

సన్నబియ్యానికి రెక్కలు!

Jul 14 2026 1:36 AM | Updated on Jul 14 2026 1:36 AM

మరికల్‌: వర్షాభావ పరిస్థితులతో వరిసాగు గణనీయంగా తగ్గుతోంది. రాబోయే రోజుల్లో సన్నబియ్యం ఉత్పత్తి తగ్గే అవకాశముందని పసిగట్టిన వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తున్నా రు. ఇదివరకే మార్కెట్‌లో ధరలు క్రమంగా పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. గతంలో సన్నాలు క్వింటా ధర రూ. 4,500 నుంచి రూ. 4,800 ఉండగా.. ప్రస్తుతం చాలా చోట్ల రూ. 5,600 వరకు ధర పెరిగింది. బియ్యం నాణ్యత మేరకు ఒక్కో చోట రూ. వెయ్యి వరకు అదనంగా భారం పడుతోంది. ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందించడం కొంత ఊరటనిస్తోంది.

ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తూ..

జిల్లాలో జైశ్రీరామ్‌, హెచ్‌ఎంటీ సోనా, ఆర్‌ఎన్‌ఆర్‌, అమని తదితర రకాల బియ్యానికి అధిక డిమాండ్‌ ఉంది. ఇక్కడి జనాభాకు అనుగుణంగా దిగుబడి లేకపోవడంతో కర్నూలు, మిర్యాలగూడ, వికారాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి సన్నబియ్యం ఎక్కువగా దిగుమతి అవుతోంది. మిల్లర్లు ఆయా జిల్లాల నుంచి వడ్లను తెప్పించి.. మరాడించి విక్రయిస్తుంటారు. అయితే రైస్‌మిల్లర్లు నిల్వల మేరకు బియ్యం తయారీని ప్రారంభిస్తున్నారు. నెలరోజుల నుంచి క్రమంగా సన్నబియ్యం ధరలు పెరుగుతుండటంతో మిల్లర్లు ఆచిచూచి వడ్లను మరాడిస్తున్నారు.

రెండేళ్ల తర్వాత..

వానాకాలంలో మాత్రమే అధిక శాతం రైతులు సన్నరకాలను పండిస్తూ వస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల రైతులకు సాగునీటి సదుపాయం లభించడంతో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రెండేళ్ల క్రితం సన్నబియ్యం ధర తగ్గుముఖం పట్టింది. ఈసారి మాత్రం వర్షాభావ పరిస్థితుల కారణంగా సన్నబియ్యం ధరలు అమాంతం పెరుగుతుంగటంతో కొనలేని పరిస్థితి వస్తోంది.

తగ్గుతున్న వరిసాగు..

జిల్లాలో ప్రతి ఏటా వానాకాలంలో 1.80 లక్షల ఎకరాల్లో సన్నరకాలను సాగుచేస్తున్నారు. ఇందులో లక్షకు పైగా ఎకరాల్లో వచ్చిన దిగుబడిని ప్రభుత్వం ఏర్పాటుచేసే కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయిస్తుంటారు. మిగతా ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులు కొనుగోళ్లు చేస్తారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లా అంతటా వరిసాగు దాదాపు 50వేల ఎకరాల వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే సన్నబియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నారు.

వర్షాభావ పరిస్థితులతో అమాంతం పెరుగుతున్న ధరలు

ఇప్పటికే క్వింటా రూ. 5,600 పలుకుతున్న రేటు

సామాన్యులపై అదనపు భారం

జిల్లాలో తగ్గుతున్న వరిసాగు విస్తీర్ణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement