● హ్యామ్ రోడ్లతో అభివృద్ధి వేగవంతం
● రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నారాయణపేట/మక్తల్: ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన రవాణా వ్యవస్థను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని మక్తల్‌లో రూ.237 కోట్లతో నిర్మించనున్న మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల హ్యామ్ రహదారి నిర్మాణానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మంచిరోడ్లు ఉంటేనే పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.. అభివృద్ధికి నాణ్యమైన రహదారులే పునాదులని అన్నారు. గత ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిని నిరక్ష్యం చేసిందని విమర్శించారు. మక్తల్–పేట రహదారి నిర్మాణాన్ని 12 – 16 నెలల్లో పూర్తిచేస్తామన్నారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూ సేకరణలో ప్రజలు సహకరించాలని.. భూములు ఇచ్చే వారికి ప్రభుత్వం న్యాయమైన పరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక్క ప్యాకేజీలోనే రూ. 547కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రవాణా, సాగునీటి పరంగా మక్తల్ మంచి పురోగతి సాధిస్తుందన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభించిన రోడ్ల నిర్మాణ పనులు చారిత్రాత్మకమైనవని అన్నారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను ప్రాధాన్యంగా తీసుకొని భారీ ప్రాజెక్టులను మంజూరు చేసిందన్నారు. గత ప్రభుత్వం నాణ్యమైన రహదారుల నిర్మాణంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజల రవాణా కష్టాలు తొలగించాలనే సంకల్పంతో రూ. 237 కోట్లతో మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారిని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అంతకుముందు ఊట్కూర్ మండలం తిప్రాస్‌పల్లి నుంచి మక్తల్ మండలం కాచువార్ వరకు మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఎస్పీ డా.వినీత్, మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస, మార్కెట్ చైర్మన్లు రాధా లక్మారెడ్డి, సదాశివారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, ఆర్‌అండ్‌బీ సీఈ వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఈ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


