ప్రజావాణిలో వినతుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణిలో వినతుల వెల్లువ

Jul 14 2026 1:36 AM | Updated on Jul 14 2026 1:36 AM

నారాయణపేట: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను డీఆర్వో రాజేశ్వరి దృష్టికి తీసుకొచ్చి అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం పెంచి.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, ప్రజావాణిలో భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పింఛన్లు తదితర సమస్యలపై 32 అర్జీలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ ఫణిరాజ్‌ పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లపై విచారణ జరపాలి..

ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జరిగిన అక్రమాలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి.. అర్హులకు న్యాయం చేయాలి. కొందరు నాయకులు డబ్బులను తీసుకుని అనర్హులకు ఇళ్లు మంజూరు చేయిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి. లబ్ధిదారుల జాబితాను బహిరంగంగా ప్రకటించాలి.

– గౌతమ్‌, బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మక్తల్‌

అన్యాయం చేయొద్దు..

13 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు వివిధ కళలు, వృత్తి, వ్యాయామ విద్య బోధిస్తున్నాం. ఇప్పుడు వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ పేరుతో ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల నుంచి ఇతర పాఠశాలలకు పంపేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టడం సరైంది కాదు. మేము కేవలం రూ. 11,700 గౌరవ వేతనంతో సేవలందిస్తున్నాం. తమను మరో పాఠశాలకు మార్చడం వల్ల కుటుంబ, ప్రయాణ, ఆర్థిక ఇబ్బందులు మరింత పెరుగుతాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.

– తెలంగాణ కళా, వృత్తి, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా నాయకులు

రికార్డుల్లో తప్పిదాలతో రైతుభరోసా రాలేదు..

తరతరాలుగా సాగుచేస్తున్న భూముల వివరాలను రికార్డుల్లో తప్పుగా నమోదు చేయడంతో రైతుభరోసా రావడం లేదు. పేట–కొడంగల్‌ ప్రాజెక్టుకు భూ సేకరణ సందర్భంగా సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణం, యాజమాన్యుల వివరాల నమోదులో జరిగిన పొరపాట్లతో ఇబ్బందులు పడుతున్నాం. దామరగిద్ద తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన నమోదు లోపాలే ఈ సమస్యకు ప్రధాన కారణం. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలి. – గడిమునకపల్లి గ్రామ రైతులు,

దామరగిద్ద మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement