ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి

Sep 23 2026 1:49 AM | Updated on Sep 23 2026 1:49 AM

బొమ్మలసత్రం: పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదకంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సునీల్‌ షోరాణ్‌ అన్నారు. పట్టణంలోని ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. సరైన పత్రాలు లేక పోలీసు స్టేషన్‌లో నిలిచి పోయిన వాహనాల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలన్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద వాహన దారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే తక్షణమే వాహనాలను సీజ్‌ చేయాలని ఆదేశించారు.

వెయిటేజ్‌ మార్కులు పరిశీలించుకోవాలి

నంద్యాల(న్యూటౌన్‌): కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుల నియామకం, ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థులు వెరిఫైడ్‌ స్కోర్‌ వివరాలు, వెయిటేజ్‌ మార్కులను పరిశీలించుకోవాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమగ్ర శిక్ష పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో కాంట్రాక్ట్‌ నియామకాల ఉపాధ్యాయులకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులందరూ పరిశీలించుకోవాలన్నారు. అభ్యర్థులు అభ్యంతరాలు ఉన్నట్లు అయితే సమగ్ర శిక్ష నంద్యాల కార్యాలయంలో ఈనెల 23 నుంచి 26వ తేదీలోగా సమర్పించుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌తో పత్తిలో కాయకుళ్లు నివారణ

నంద్యాల(అర్బన్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం పత్తి కాయకట్టే దశలో ఉందని, ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తికి కాయకుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉందని నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్త శివరామకృష్ణ అన్నారు. ఈ తెగులు నివారణకు ముందుగా కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 2.5 గ్రాములు, కార్బండిజం లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాయకుళ్లు తెగులు వల్ల పంట దిగుబడి, పత్తి నాణ్యత దెబ్బతినే అవ కాశం ఉందన్నారు. మొదట పొలంలో నీటి నిల్వలు లేకుండా చూసుకొని వర్షాలు ఆగిన తర్వాత పత్తి తీత చేసుకోవాలని సూచించారు.

25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

గోస్పాడు: ఈనెల 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శారదాబాయి పిలుపు నిచ్చారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని ఆసుపత్రి ఆవరణలో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరు పూర్తి సహకారం అందించాలన్నారు. పిల్లల ఆరోగ్యం, భద్రత విషయంలో పాఠశాలలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ప్రైవేట్‌ పాఠశాలల అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

కష్టానికి ‘న్యాయం’

డోన్‌ రూరల్‌(ప్యాపిలి): సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఓ యువకుడు పట్టుదలతో చదివి సివిల్‌ జడ్జి పరీక్షల్లో సత్తా చాటి న్యాయ మూర్తిగా బాధ్యతలు చేపడుతున్నారు. ప్యాపిలి మండలం రాచర్ల గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, విజయలక్ష్మి దంపతులది రైతు కుటుంబం. వీరి కుమారుడు తాతిరెడ్డి కిరణ్‌ కుమార్‌రెడ్డి జ్యూడిషియల్‌ సర్వీస్‌ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్‌ సాధించారు. శిక్షణ అనంతరం ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ నెల 26న న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్తులు, డోన్‌ బార్‌ న్యాయవాదులు అభినందిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement