● అసందర్భ మాటలు మానుకోండి
● ఎమ్మెల్యే కోట్లకు
మాజీ మంత్రి బుగ్గన హితవు
డోన్: చేతనైతే డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపాలని, అసందర్భ మాటలు మానుకోవాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హితవు పలికారు. అభివృద్ధి పనులు చేయకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల అండతో గెలవాలని చూస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిఘటించి తీరుతామని హెచ్చరించారు. డోన్‌లో సోమవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ముందు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో బుగ్గన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఆక్రమ కేసులు బనాయిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడే అవకాశం ఉన్నందున నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పారిశ్రామికరంగం.. తీవ్ర సంక్షోభం
వైన్స్, మైన్స్, శ్యాండ్, ల్యాండ్ అంటూ అక్రమ వ్యాపారాలు జోరుగా చేయడం ఏ మగతనం అని టీడీపీ నాయకులను మాజీ మంత్రి నిలదీశారు. మామూళ్ల కోసం ప్యాపిలి మండలంలోని ప్రియా సిమెంట్ ఉత్పత్తికి ఆటంకం కల్గించడం, పాణ్యం సిమెంట్‌తో పాటు అనేక చిన్న తరహా పరిశ్రమలను మూత వేయించిందెవరని ప్రశ్నించారు. డోన్‌లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కాకుండా అడ్డుకుందెవరన్నారు. టీడీపీ నాయకుల అవినీతి, ఆక్రమాలతో పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.
ఐడీ కార్డుల పంపిణీ
సమావేశంలో కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ ఇచ్చే గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. మొట్టమొదటిగా మాజీ మంత్రి బుగ్గనకు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గుర్తింపు కార్డు ఇచ్చారు. అనంతరం పార్టీ నాయకులు పోస్ట్ ప్రసాద్, దినేష్‌గౌడ్, ఆర్ట్ రమణ, మల్లికార్జునరెడ్డి, మిట్టా రవి, వలీ తదితరులు గజమాలలతో బుగ్గనను, ఎర్రబోతుల పాపిరెడ్డిని సత్కరించారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మల్యాల భాస్కర్‌రెడ్డి, గుమ్మకొండ సుధాకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, మధురెడ్డి, ఓబులేసు, నరసింహుడు, శ్రీను, మదన్ యాదవ్, మధుసూదన్‌రెడ్డి, సుమిత్రమ్మ, కల్యాణి, వెంకటేశ్వరమ్మ, మేకల విమల, చిరంజీవి, వేమారెడ్డి, మిట్టా రవికుమార్, మద్దిలేటి, తపాలా మద్దిలేటి, దొంతిరెడ్డి గోపాలరెడ్డి, మద్దయ్య, మల్యాల శ్రీనివాసరెడ్డి, రామ్‌కుమార్, జానకీరాముడు, రాజు, పెద్దిరాజు, రమణ, బుగ్గన జయచంద్రారెడ్డి, బోబ్బల శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మగతనం గురించి మాట్లాడడం సిగ్గుచేటు!
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.3,500 కోట్ల వ్యయంతో డోన్‌ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని బుగ్గన అన్నారు. రెండున్నర ఏళ్లుగా అభివృద్ధిని నిలిపి వేసి భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. డోన్‌కు మంజూరైన రైల్వే అండర్ పాస్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ, ఎస్సీ బాలుర ఆశ్రమ పాఠశాల, ప్యాపిలి ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మెట్టుపల్లె టమాట జూస్ ఫ్యాక్టరీల మంజూరును ఎందుకు అడ్డుకున్నారో ఎమ్మెల్యే కోట్ల చెప్పాలన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేసి కూడా రైల్వే గేట్ల కింద అండర్ పాస్ బ్రిడ్జిని ఎందుకు మొదలుపెట్టలేక పోయారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ నాయకులను మగతనం లేనివారిగా అభివర్ణించడం కోట్ల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. టీడీపీ నాయకులకు మగతనం ఉంటే చెరువులు ఎందుకు నింపలేకపోయారని ప్రశ్నించారు. ఇంటింటికీ గోరుకల్లు శుద్ధజలం పథకాన్ని అడ్డుకోవడం మూర్ఖత్వమన్నారు. ఎంపీడీఓ కార్యాలయం, కేంద్రీయ విద్యాలయ భవనం, ఐటీడీఆర్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలు ఎందుకు ప్రారంభించలేకపోయారని ప్రశ్నించారు.


