● వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగే
వాటిని విడిపిస్తాం
● నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవి,
ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
బొమ్మలసత్రం: చంద్రబాబు ప్రభుత్వంలో వక్ఫ్‌బోర్డు ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రవ్యాప్తంగా కబ్జాలకు గురవుతున్నాయని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా అన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కబ్జాదారుల నుంచి వక్ఫ్ ఆస్తులను విడిపిస్తామన్నారు. నంద్యాల పట్టణ శివారులో ఉర్దూ కళాశాల వసతి గృహం భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించటాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం స్థానిక గాంధీచౌక్‌లో ఎస్‌డీపీఐ నాయకులు నిరసన తెలిపారు. నిరసనకు మాజీ ఎమ్మెల్యే శిల్పారవి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో వక్ఫ్ ఆస్తులకు భద్రత కరువైందన్నారు. ఇష్టానుసారంగా వాటిని ఇతర రంగాలకు అప్పగిస్తున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉర్దూ కళాశాల భవనాలు నిర్మించిందన్నారు. అలాగే వసతి భవనాలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ భవనాలను ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలకు అప్పగించాలని టీడీపీ నేతలు ప్రయ త్నాలు చేస్తున్నారన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను మైనారిటీల అభివృద్ధికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించడం సరైందికాదన్నారు. మైనారిటీల హక్కులను కాలరాస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై రాజీ లేని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. బాధితులు, ప్రజాసంఘాలు చేసే ప్రతి పోరాటానికి వైఎస్సార్‌సీపీ వెన్నంటి ఉంటుందన్నారు. నిరసనలో మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, రాష్ట్రమహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు తమీమ్, లక్ష్మీనారాయణ, సాధిక్‌బాషా, కిరణ్‌కుమార్, గన్నీ కరిముల్లా, జలీల్ తదితరులు పాల్గొన్నారు.


