● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వాసు
డోన్ టౌన్: ఖైదీలు కోర్టు వాయిదాలకు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.వాసు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. డోన్ పట్టణంలోని సబ్ జైలును సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలతో సమావేశమై జైలులోని వసతులు, వైద్య సేవల గురించి వివరించారు. ప్రిజన్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్, క్లినిక్‌లో ఒక న్యాయవాది, ఒక పారా లీగల్ వలంటీర్ ఉంటారని. వారు సహాయం అందిస్తారని తెలిపారు. జైలులో ఏమైనా సమస్యలు ఉంటే కంప్లయింట్ బ్యాక్స్‌లో పిటిషన్ రాసి వెయ్యవచ్చు అన్నారు. లేదంటే 15100కు కాల్ చేసి తమ సమస్యలు చెప్పుకోవచ్చునని తెలిపారు. అనంతరం జైలు లోని బ్యారాక్‌లను, వంట శాలను, పరిసరాలను పరిశీలించారు. అలాగే సబ్ కోర్టు ఏర్పాటు కోసం డోన్ పట్టణంలోని పాతపేటలోని పాత మున్సిపల్ కార్యాలయాన్ని, నిర్మాణంలో ఉన్న కోర్టు భవనాలను పరిశీలించారు. వీరి వెంట రూరల్ సీఐ రాకేష్, సబ్ జైలు సూపరింటెండెంట్ సురేష్, ప్యానెల్ న్యాయవాది రవిమోహన్, మద్దయ్య, కోర్టు సిబ్బంది సరిత, ఇందిర ఉన్నారు.


