చాగలమర్రి: జేబులో పెట్టుకున్న సెల్‌ఫోన్ పేలడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండలంలోని ముత్యాలపాడు గ్రామానికి చెందిన లక్కబోయిన హరి వారం రోజుల క్రితం ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ తాను విధులు నిర్వహిస్తున్న రాణిగంజ్ ప్రాంతంలోని ఎస్‌ఆర్‌ఆర్ కార్యాలయానికి వెళ్లే క్రమంలో లిఫ్ట్‌లో వెళ్తుండగా తాను ధరించిన ప్యాంటు జేబులో సెల్‌ఫోన్ నుంచి పొగలు వెలువడి కాలిపోతుండటంతో వెంటనే ఫోన్‌ను బయటకు తీసి పక్కకు విసిరేశాడు. క్షణాల్లోనే సెల్‌ఫోన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. సెల్‌ఫోన్ కాలుతుండగా అప్రమత్తమై దూరంగా విసిరేయడంతో గాయాలతో బయటపడ్డాడు. అతని ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చినట్లు బాధితుడు తెలిపాడు. సెల్‌ఫోన్ బ్యాటరీలో ఉండే లిథియం–అయాన్‌లు అంతర్గతంగా విచ్చిన్నమై వేడి రసాయన చర్యను సృష్టించడం వల్ల పేలుడు సంభవించినట్లు నిపుణులు చెప్పారని బాధితుడు వెల్లడించారు.


