● విజిలెన్స్ దాడుల్లో మూడు ఇసుక,
రెండు మట్టి టిప్పర్ల పట్టివేత
మంత్రాలయం: ఇసుకాసురులు హద్దులు దాటుతున్నారు. అర్ధరాత్రి వేళ ఇసుక దందాను దర్జాగా నడుపుతున్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో విజిలెన్స్ అధికారులు దాడులకు దిగారు. ఈ దాడుల్లో 5 టిప్పర్లు పట్టుబడ్డాయి. వివరాలివి.. కౌతాళం మండలం గుడికంబాళి, నదిచాగిలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. అక్కడి నుంచి కర్నూలు జిల్లా ప్రజలు ఇసుకను తెచ్చుకుంటారు. అయితే కొందరు స్వార్థపరులు రీచ్‌లపై పడ్డారు. అక్కడి నుంచి అక్రమంగా ఇసుకను గుట్టుగా తరలిస్తున్నారు. మంగళవారం రాత్రి మైనింగ్ విజిలెన్స్ అధికారులు అక్రమ రవాణాపై దాడులు చేపట్టారు. మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడికంబాళి నుంచి ఇసుకను తరలిస్తున్న టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు. టిప్పర్లకు (ఏపీ 39 డబ్ల్యూక్యూ 6839, ఏపీ 39 డబ్ల్యూపీ 8439, ఏపీ 39 డబ్ల్యూఏ 8752) అనుమతులు లేవని గుర్తించి మాధవరం పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అలాగే మంత్రాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రెండు మట్టి టిప్పర్లు పట్టేశారు. నందవరం మండలం గంగవరం నుంచి మట్టిని స్థానిక బైపాస్ రోడ్డుకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మిగనూరుకు చెందిన ఓ టీడీపీ నాయకుడి అండదండలతో ఎలాంటి అనుమతుల్లేకుండా మట్టి మాఫియా సాగిస్తున్నారు. పట్టుబడిన రెండు టిప్పర్లు (కేఏ 36 సీ 9316, ఏపీ 39 యూఎం 1187)ను మంత్రాలయం పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.


