నంద్యాల: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న చీకటి ఒప్పందం చేసుకున్నారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీరును తెలంగాణ రాష్ట్రానికి మళ్లిస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. నంద్యాల పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శిల్పా రవి మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో రైతాంగం తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే, సాగునీటి కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని రిజర్వాయర్లు, కాల్వలకు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. వెలుగోడు రిజర్వాయర్ సామర్థ్యం 17 టీఎంసీలు కాగా ఇప్పటికి 4 టీఎంసీలు మాత్రమే నీరు ఉన్నాయన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ 12.5 టీఎంసీల సామర్థ్యం కాగా 6 టీఎంసీల నీరే ఉందన్నారు. అవుకు రిజర్వాయర్ 4.5 టీఎంసీల సామర్థ్యం కాగా ఒక టీఎంసీ మాత్రమే ఉందన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువు వస్తుందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రైతులను జైళ్లకు పంపారు!
ఎరువులు, పురుగుమందుల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. యూరియా కోసం ఆన్‌న్‌లైన్ అప్లికేషన్లు పెట్టించడం, పంపిణీలో రాజకీయ రంగులు పులమడం సిగ్గుచేటన్నారు. మద్దతు ధర అడిగిన రైతులపై కేసులు పెట్టి జైళ్లకు పంపిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్మన్, కౌన్సిలర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు వంటి అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు రంగంలో ఉంటారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఏ స్థానం ఏకగ్రీవం కానివ్వమని, ప్రతి స్థానానికి పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో నంది రైతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, మాజీ మార్కె ట్ యార్డు చైర్మన్ పురుషోత్త్తం రెడ్డి, వైఎస్సార్‌సీపీ డోన్ నియోజకవర్గం పరిశీలకుడు దేశం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ సెక్రటరీ శంకర్ నాయక్, కృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
సాగు, తాగునీరు
విడుదల చేయకుంటే రైతులతో కలిసి
ఉద్యమిస్తాం
మాజీ ఎమ్మెల్యే
శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి
రాయలసీమకు తీవ్ర ద్రోహం
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచి రాయలసీమను కరువు నుంచి మహానేత కాపాడారని గుర్తుచేశారు. కానీ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి ఈ ప్రాంతానికి తీవ్రద్రోహం చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల నుంచే నీటిని తోడుకుంటున్నా, ఏపీ ప్రభుత్వంవాటా నీటిని సరిగ్గా వినియోగించుకోలేకపోతోందన్నారు. నంద్యాల మండల పరిధిలో సుమారు 30 వేల ఎకరాల్లో పంటలు సాగు కావలసి ఉందని, వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణ తాగునీటి అవసరాలు, మిట్నాల చెరువు నీటి ఎద్దడి తీర్చేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏంటో స్పష్టం చేయాలన్నారు. తక్షణమే కాలువలకు నీటిని విడుదల చేయకపోతే, రైతులను సమీకరించి స్వయంగా వెళ్లి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు.


