శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

Aug 22 2026 2:05 AM | Updated on Aug 22 2026 2:05 AM

వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న భక్తులు

శ్రీశైలం టెంపుల్‌: వరలక్ష్మీవ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీశైలంలోని చంద్రావతి కల్యాణమండపంలో ఉచిత సామూహికవ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతంలో 1800 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. వీరికి కావలసిన పూజా ద్రవ్యాలన్నింటినీ దేవస్థానమే సమకూర్చింది. ప్రతి ఒక్కరికి వేర్వేరుగా కలశాలను నెలకొల్పారు. తొలుత మహాగణపతి పూజ నిర్వహించారు. తరువాత వేదికపై ఆశీనులను చేయించిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపించారు. అనంతరం భక్తులందరిచేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవిని సమంత్రకంగా ఆవాహన చేశారు. శ్రీసూక్త విధానంలో వ్రతకల్ప పూర్వకంగా షోడశోపచారపూజలు జరిపించారు. అనంతరం అర్చకులు వ్రతకథను పఠించి వ్రతమహిమావిశేషాలను భక్తులకు తెలిపారు. చివరగా నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేశారు. వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ, చీర, రవికవస్త్రం, పూలు, గాజులు, కంకణాలు, వక్షప్రసాదంగా తులసి మొక్క, పుస్తక ప్రసాదంగా శ్రీశైలప్రభ మాసపత్రిక, మూడు రకాల ప్రసాదాలు అందజేశారు. వ్రతానంతరం భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించారు. దర్శనానంతరం అన్నపూర్ణ భవనంలో భక్తులందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. చంద్రావతి కల్యాణమండపంలో ప్రత్యేకంగా ఎల్‌ఈడి స్క్రీనును కూడా ఏర్పాటు చేశారు. కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement