ఉరుకుంద హుండీ ఆదాయం రూ.96 లక్షలు | - | Sakshi
Sakshi News home page

ఉరుకుంద హుండీ ఆదాయం రూ.96 లక్షలు

Aug 22 2026 2:11 AM | Updated on Aug 22 2026 2:11 AM

కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శ్రావణమాసం రెండవ గురువారం భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. నగదు రూపంలో రూ.96,53,938 వచ్చినట్లు ఆలయ డప్యూటీ కమిషనర్‌ వాణి తెలిపారు. అలాగే వెండి 13 కేజీల 450 గ్రాములు, బంగారం 6 గ్రాముల 300 మిల్లీగ్రాములు వచ్చినట్లు చెప్పారు.

లోన్స్‌ పేరుతో సైబర్‌ మోసాలు

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు (టౌన్‌): లోన్లు మంజూరు చేస్తామని నమ్మించి డబ్బులు కాజేస్తున్న సైబర నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా వచ్చే సందేశాలను నమ్మి ముందుగా డబ్బులు చెల్లించవద్దని సూచించారు. మరిన్ని డబ్బులు చెల్లించాలని కోరడం, లేదంటే ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే లోన్‌ ఆఫర్లు నమ్మవద్దన్నారు. ఓటీపీ, ఏటీఎం పీన్‌, సీవీవీ, బ్యాంకు వివరాలు ఎవరకీ చెప్పకూడదని తెలిపారు. అనుమానాస్పద లింకులు క్లిక్‌ చేయవద్దని, సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌ లైన్‌కు కాల్‌ చేయాలన్నారు.

శ్రీశైలంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

శ్రీశైలం ప్రాజెక్ట్‌: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పాదన కొనసాగుతోంది. కుడిగట్టు కేంద్రంలో లోడ్‌ డిశ్పాచ్‌ ఆదేశాల మేరకు గురువారం నుంచి శుక్రవారం వరకు విద్యుత్‌ ఉత్పాదన తాత్కాలికంగా నిలిపివేశారు. ఎడమగట్టు కేంద్రంలో ఉత్పాదన కొనసాగుతోంది. ఎడమగట్టు కేంద్రంలో 20.159 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జున సాగర్‌కు 40,751 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా 8వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 3,050 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జూరాల నుంచి శ్రీశైలానికి 34,803 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 167.8764 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 875.90 అడుగులకు చేరుకుంది.

బేతంచెర్లలో బాలుడిపై కుక్కల దాడి

బేతంచెర్ల: కుక్కలు దాడిచేయడంతో బేతంచెర్లలోని హనుమాన్‌నగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు సయ్యద్‌ మహీర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. పాఠశాలకు శుక్రవారం సెలవు కావడంతో ఇంటి సమీపాన ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. బాలుడి ఏడుపు వినిపించడంతో కుటుంబ సభ్యులు, కాలనీవాసులు అప్రమత్తమై కేకలు వేశారు. దీంతో కుక్కలు పారిపోయాయి. శరీర భాగాలతో పాటు చేతి సంకలో తీవ్రంగా గాయపడిన బాలుడిని శేషారెడ్డి సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు 108లో కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గత ఏడాది మే 2వ తేదీన ఇదే కాలనీలో నాలుగేళ్ల బాలుడు షేక్‌ మొహిద్దీన్‌ కుక్కల దాడిలో మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే మళ్లీ వీధి కుక్కలు దాడి చేయడంతో కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement