● టెండర్ ప్రకటనలో
పొరపాటు జరిగింది
● దేవస్థాన రెవెన్యూ విభాగ
ఏఈఓ శ్రీనివాసరెడ్డి
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల ప్రధాన ఆలయానికి ఎదురుగా గంగాధర మండపం వద్ద ఉన్న కొబ్బరికాయల గోడౌన్ పక్కనే పూజాద్రవ్యములు, ఒత్తులు అమ్ముకునే షాపు ఉంటుందని శ్రీశైల దేవస్థాన రెవెన్యూ విభాగ సహయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘టెండర్ నిబంధనలు భేఖారత్’ అనే శీర్షికతో వార్తా కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన దేవస్థానం అధికారులు ఈ నెల 15వ తేదీన ఇచ్చిన దుకాణాల టెండర్ నోటీసు ప్రకటనలో చిన్నపాటి పొరపాటు జరిగిందని, అందులో దుకాణం నిర్వహించుకునే స్థలం ప్రచురితం కాలేదని, అంతేతప్పా ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ దుకాణం బహిరంగ వేలం, ఇ–టెండర్ నిర్వహిస్తున్నామని, పూర్తి వివరాలను ఇ–టెండర్‌లో పొందుపర్చామని, అలాగే ఆసక్తి కలిగిన వారు సంప్రదించేందుకు ముగ్గురు అధికారుల ఫోన్ నంబర్లు పొందుపర్చామని పేర్కొన్నారు.
దుకాణాలు తొలగించి..
మళ్లీ అదే ప్రదేశంలో కేటాయింపు?
శ్రీశైల క్షేత్ర అభివృద్ధి, రథోత్సవం తిలకించేందుకు భక్తులకు అసౌకర్యం లేకుండా రహదారుల విస్తరణ కోసం ప్రధాన ఆలయానికి ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగించి లలితాంబా వాణిజ్య సముదాయంలో దుకాణాలు కేటాయించారు. అంతేకాకుండా ఆ ప్రదేశంలో సాలు మండపాలు నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పుడు అదే ప్రదేశంలో దుకాణాలు కేటాయిస్తే ఎలా అని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా ప్రతి దుకాణంలోనూ నాణ్యమైన నూనె, పూజా ద్రవ్యములు, ఒత్తులు విక్రయించుకుంటున్నామని, గంగాధర మండపం వద్ద ప్రత్యేకంగా షాపు ఏర్పాటు చేస్తే లలితాంబా వాణిజ్య సముదాయంలోని దుకాణాలకు భక్తులు ఎలా వస్తారని వాపోతున్నారు. టెండర్ నోటీసులో పొందుపర్చిన సైజు ప్రకారం గతంలో ప్రధానాలయానికి ఎదురుగా రెండు వైపులా ఉన్నవారికి కూడా దుకాణాలు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


