అప్పులబాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య
జూపాడుబంగ్లా: అప్పులబాధ తాళలేక నందికొట్కూరు పట్టణానికి చెందిన పింజరి రఫి (46) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రోడ్డు ట్యాంకు ఏరియాకు చెందిన పింజరి రఫి కుటుంబ పోషణ, ఇంటి నిర్మాణం కోసం తెలిసిన వారితో పాటు బ్యాంకులో అప్పులు చేశాడు. ఇచ్చిన అప్పులు తిరిగి చెల్లించాలని రుణదాతలు కోరడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక బుధవారం తర్తూరు గ్రామ పొలిమేరలోని రంగయ్యశెట్టి పొలం వద్ద పురుగుల మందుతాగి పడిపోయాడు. విషయం తెలుసుకొన్న కుటుంబ సభ్యులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని హుటాహుటినా నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పుటికే చనిపోయినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకొన్న ఎస్‌ఐ మల్లికార్జున ఆసుపత్రికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతుని కుమారుడు పింజరి చాంద్‌బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
నేలకూలిన 150 ఏళ్ల వేప చెట్టు
వెలుగోడు: పట్టణంలోని స్థానిక అరుగుల వద్ద దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన వేపచెట్టు మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులు, భారీ వర్షానికి ఒక్కసారిగా నేలకూలింది. వేళ్లతో సహా కూలిపోవడంతో ఆ ప్రాంతంలో కొంతసేపు భయాందోళన నెలకొంది. విద్యుత్ తీగలపై పడటంతో స్తంభం ట్రాన్స్‌ఫార్మర్‌తో సహా కూలిపోయింది. అయితే ఘటన అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకోవడంతో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో స్థానికులు, వ్యాపారులు ఊపిరిపీల్చుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. ఈ వేపచెట్టు దశాబ్దాలుగా వెలుగోడు ప్రజలకు నీడనిచ్చే చారిత్రాత్మక చెట్టుగా గుర్తింపు పొందింది. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు వందలాది మంది అరుగుల వద్ద కూర్చుని కాలక్షేపం చేస్తుంటారు. చెట్టు కిందే ద్విచక్ర వాహనాలను కూడా పార్కింగ్ చేస్తుంటారు. ఒకవేళ ఈ ఘటన పగటిపూట జరిగి ఉంటే భారీ ప్రాణనష్టంతో పాటు ద్విచక్ర వాహనాలు ధ్వంసమై తీవ్ర ఆస్తి నష్టం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
కోవెలకుంట్ల: పట్టణ శివారులోని స్కంద కాలనీలో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. బుధవారం స్థానికులు అందించిన సమాచారం మేరకు.. కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి బాబయ్య భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి నాలుగు రోజుల క్రితం హైదరాబాదులో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు తలుపు తాళం బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని రూ. 3 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ. 5 వేలు నగదు అపహరించుకెళ్లారు. ఇంటి తలుపు తెరచి ఉండటంతో ఇంటి పక్కనే నివాసం ఉంటున్న బాబయ్య తమ్ముడు గమనించి అన్నకు సమాచారం చేరవేశాడు. హైదరాబాదు నుంచి హుటాహుటినా ఇంటికి చేరుకుని చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు క్లూస్‌టీం చోరీకి సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(సెంట్రల్): భారతీయ వాయు సేనలో అగ్నివీర్‌వాయు (మ్యూజిషియన్) పోస్టుల భర్తీకి అవివాహిత భారతీయ పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 12 వాయు సైనిక ఎంపిక కేంద్ర రిక్రూటింగ్ ఆఫీసర్ తెలిపినట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ పి.దీప్తి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అగ్నిపథ్ పథకంలో భాగంగా ఎంపికై న అభ్యర్థులకు నాలుగు సంవత్సరాల సర్వీసు వ్యవధి ఉంటుందని, ఆ తరువాత ప్రతిభ ఆధారంగా 25 శాతం మందికి శాశ్వత ఉద్యోగ అవకాశం కల్పిస్తారని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఢిల్లీ, బెంగళూరులలో జరిగే ర్యాలీలో పాల్గొనాల్సి ఉంటుందని, అర్హత కలిగి ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు భారతీయ వాయు సేన అధికారి వెబ్‌సైట్ WWW. IAFRECRUITMENT. CDAC. INలో అడ్మిట్ కార్డులను పొందాలని ఆమె సూచించారు.


